Fact Check : 263 కోట్ల రూపాయలతో బీహార్ లో నిర్మించిన బ్రిడ్జి 29 రోజులలో కూలిపోయిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 5:15 PM IST
Fact Check : 263 కోట్ల రూపాయలతో బీహార్ లో నిర్మించిన బ్రిడ్జి 29 రోజులలో కూలిపోయిందా..?

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అస్సాం, బీహార్, ఢిల్లీ, యుపి రాష్ట్రాలలో వరదలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో వరదల ఉధృతి ఎక్కువగా వుంది. బ్రహ్మపుత్ర నది మహోగ్ర రూపంలో ప్రవహిస్తోంది. బీహార్ రాష్ట్రంలో వరదల కారణంగా మూడు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ వరదల వలన బీహార్ లోని సత్తార్ ఘాట్ బ్రిడ్జి కూలిపోయిందని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అది కూడా బ్రిడ్జిని ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే కూలిపోయిందంటూ సామజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సత్తార్ ఘాట్ వంతెనకు చెందిన ఓ భాగాన్ని 264 కోట్ల రూపాయలతో నిర్మించారని.. అది కూలిపోయిందంటూ వార్తా కథనాలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. తెలుగు మీడియా సంస్థలు కూడా వార్తలను ప్రసారం చేశాయి.

నిజ నిర్ధారణ:

వరదల కారణంగా బ్రిడ్జి కూలిపోలేదు.. ఇంతకు ముందు నిర్మించిన రోడ్డు వరద నీటి కారణంగా కొట్టుకుపోయింది. బ్రిడ్జికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది.



పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ బీహార్ @IPRD Bihar తమ అఫీషియల్ అకౌంట్ లో ఈ వదంతులపై క్లారిటీ ఇచ్చింది. కొట్టుకుపోయినది పాత 18 మీటర్ల పొడవున్న బ్రిడ్జి అని తెలిపింది. వరద నీరు విపరీతంగా రావడంతో సత్తార్ ఘాట్ బ్రిడ్జికి వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని స్పష్టం చేసింది. 1.4 కిలోమీటర్ల పొడవున్న సత్తార్ ఘాట్ వంతెనకు ఎటువంటి నష్టం కలగలేదని క్లారిటీ ఇచ్చింది.



ప్రస్తుతం సత్తార్ ఘాట్ వంతెన ఎలా ఉందో తెలుపుతూ జులై 16, 2020న యుట్యూబ్ లో వీడియోను అప్లోడ్ చేసింది. ये है सत्तरघाट पुल जो पूर्वी चम्पारण के केसरिया में गंडक नदी पर स्थित है। मीडिया द्वारा इसके टूटने की खबर चलायी जा रही है जो पूरी तरह झूठी और भ्रामक है। आप देख सकते हैं यह पुल पूरी तरह सुरक्षित है। అంటూ వీడియోను లింక్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వదంతులన్నీ అబద్ధాలని, నమ్మకండని హితవు పలికింది.

ప్రముఖ రాజకీయ నాయకులు నంద కిషోర్ యాదవ్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. బ్రిడ్జికి ఎటువంటి హాని జరగలేదని స్పష్టం చేశారు.

The Hindu, Hindustan Times కథనాల ప్రకారం సత్తార్ ఘాట్ వంతెనకు ఎటువంటి నష్టం కలుగలేదు. 18 మీటర్ల అప్రోచ్ రోడ్ 'గండకీ నది' నీటి ఉధృతికి కొట్టుకుని పోయింది. అక్కడ ఉన్న బ్రిడ్జికి కూడా ఎటువంటి నష్టం కలగలేదని.. సత్తార్ ఘాట్ వంతెనకు దీనికి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన నెల రోజులు కూడా నిలవలేదన్న వార్తలు అవాస్తవమని.. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆ చిన్న రోడ్డు నీటి ఉధృతికి కొట్టుకుని పోయిందని అధికారులు వెల్లడించారు.

Altnews, Opindia ఈ వైరల్ వార్తలను ఖండించాయి.

263 కోట్ల రూపాయలతో బీహార్ లో నిర్మించిన బ్రిడ్జి 29 రోజులలో కూలిపోయిందన్నది 'పచ్చి అబద్ధం'. ఇందులో ఎటువంటి నిజం కూడా లేదు. సత్తార్ ఘాట్ వంతెనకు ఎలాంటి నష్టం కలుగలేదు.

Next Story