Fact Check : బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో అంత మంది ప్రజలు ఉన్నారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2020 10:29 AM GMTకరోనా మహమ్మారి కారణంగా రోజురోజుకీ ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మాస్కులు వేసుకోవడం, సామాజిక దూరం పాటించడంతోనే కరోనా నుండి తమను తాము కాపాడుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది జనం ఉన్న చోట కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆసుపత్రులు లాంటి చోట ఒకరి నుండి మరొకరికి కోవిద్-19 వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఆసుపత్రిలోనే సామాజిక దూరం అన్నది పాటించకపోతే ఎలా అని కొన్ని వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు.
అవుట్ పేషెంట్స్ విభాగం ఎంతో రద్దీగా ఉందంటూ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మనిషి మనిషికీ కనీసం దూరం కూడా లేకుండా నిలబడి ఉన్నారు. మెట్ల మీద కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా అందరూ నిలబడి ఉన్న ఈ వీడియో బెంగళూరు లోని విక్టోరియా ఆసుపత్రికి చెందినదంటూ పలువురు వీడియోలను వైరల్ చేస్తున్నారు.
'విక్టోరియా ఆసుపత్రి, బెంగళూరు' అంటూ ఉన్న వీడియోను ఫేస్ బుక్, వాట్సప్ లలో వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా ఈ వీడియోలో ఉన్నది బెంగళూరు లోని విక్టోరియా ఆసుపత్రి కాదు.
మీడియా ఈ కథనాలు అబద్ధమని తేల్చేశాయి.. ఈ ఫేక్ న్యూస్ ను వైరల్ చేసిన వ్యక్తిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై Scroll.in కథనాలను వెల్లడించింది.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. ఈ వీడియోను పలువురు షేర్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందినది తెలుపుతూ వీడియోను అప్లోడ్ చేశారు.
కొందరు కామెంట్లలో ఈ వీడియోలో ఉన్న ఆసుపత్రి పాట్నాలో ఉందని తెలిపారు.
“huge crowd in Patna hospital”(ఎక్కువ జనం ఉన్న పాట్నా ఆసుపత్రి) అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా కొన్ని వీడియోలు లభించాయి. కొందరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వీడియో ఇదంటూ పోస్టు చేయగా.. మరికొందరు పాట్నా గవర్నమెంట్ ఆసుపత్రికి చెందిన వీడియో అని తెలిపారు. ఇంకొందరేమో పాట్నా లోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ లోని వీడియో అని తెలిపారు.
Biharyouth అనే ఫేస్ బుక్ పేజీ ఈ వీడియోను పోస్టు చేసింది. డాక్టర్ రాణా సింగ్ ఆ వీడియో కింద కామెంట్ చేశారు. పాట్నా లోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ కు చెందిన వీడియో అని.. దాన్ని తీసింది తానేనని తెలిపారు డాక్టర్ రాణా సింగ్. జులై 15, 2020న ఈ వీడియోను తాను తీశానని చెప్పుకొచ్చారు. ఓపిడి వార్డు నెంబర్ 5 దగ్గర విపరీతమైన జనం పోగయ్యారని.. వారందరూ కోవిద్-19 స్క్రీనింగ్ కోసం వచ్చారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి డాక్టర్లు, నర్సులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలియజేయడానికే వీడియోను తీసానన్నారు.
డాక్టర్ రాణా సింగ్ నిజంగానే మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ లో పని చేస్తున్నారా అని తెలుసుకోడానికి ఆసుపత్రి వెబ్ సైట్ ను చూడగా అందులో ఆయన మెడికల్ టీమ్ లో ఉన్నారు. Boomlive వార్తా సంస్థ కూడా పాట్నా లోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ లో చోటుచేసుకున్న ఘటన అని స్పష్టం చేసింది. ఆ ఆసుపత్రిలో పని చేసే వైద్యుడే ఈ వీడియోను తీశాడని తెలుసుకున్నారు. ఓపిడి వార్డ్ దగ్గర ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నారని తెలియజేయడానికి డాక్టర్ రాణా అభయ్ సింగ్ ఈ వీడియోను తీశారు.
'విక్టోరియా ఆసుపత్రి, బెంగళూరు' అంటూ వైరల్ అవుతున్న వీడియో అబద్ధం. ఈ వీడియోలో ఉన్నది పాట్నా లోని 'మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ ఆసుపత్రి'.