సరితా కోమటిరెడ్డి వైపే మొగ్గు చూపిన ట్రంప్..!
By తోట వంశీ కుమార్
భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన అవకాశాన్ని ఇచ్చారు. ఇండో- అమెరికన్ అటార్ని సరితా కోమటిరెడ్డిని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి పదవికి సరిత కోమటిరెడ్డిని ట్రంప్ నామినేట్ చేశారు. ఆమె నామినేషన్‌ను సెనేట్‌కు పంపినట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సెనేట్ ఆమోదం లభించిన వెంటనే న్యూయార్క్ ఈస్టర్న్ జిల్లా కోర్టు జడ్జిగా సరిత బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణలో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు సరితా కోమటిరెడ్డి. సరితా కోమటిరెడ్డి తల్లిదండ్రులిద్దరూ వైద్యులే..! హనుమంత్‌రెడ్డి, గీతారెడ్డిల కుమార్తె సరితా కోమటిరెడ్డి. వీరు అమెరికాలోని మిస్సోరిలో ప్రస్తుతం న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా అటార్నీ జనరల్ సాధారణ నేరాల విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ఆమె అంతర్జాతీయ నార్కోటిక్స్, మనీలాండరింగ్, హాకింగ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్‌గానూ ఆమె పని చేశారు. హార్వర్డ్ లా ఆఫ్ స్కూల్ నుంచి పట్టా అందుకున్న తర్వాత న్యాయశాస్త్ర విభాగంలో కొంత కాలం లెక్చరర్‌గా పని చేశారు. కొలంబియా స్కూల్, వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్‌లో సరితా కోమటిరెడ్డి విద్యార్థులకు లెక్చర్లు ఇవ్వడమే కాకుండా.. యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ జడ్జి బ్రెట్ కావానా వద్ద లా క్లర్క్‌గా పనిచేశారు.
అమెరికాలోని కీలక పదవుల్లో ఎన్ఆర్ఐ లకు పెద్ద పీట వేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు ఉన్నత పదవులను కట్టబెట్టారు. భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖేల్ పింటోను ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా నియమించారు ట్రంప్. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ధిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కు రాయబారిగా భారతీయ అమెరికన్ మనీషా సింగ్‌ను ట్రంప్ నామినేట్ చేశారు.