కరోనా వైరస్ మందు కనిపెట్టే పనిలో ఉన్న రీసెర్చర్‌ను దారుణంగా చంపారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 May 2020 5:24 AM GMT
కరోనా వైరస్ మందు కనిపెట్టే పనిలో ఉన్న రీసెర్చర్‌ను దారుణంగా చంపారు

సినిమాల్లో.. ఎవరైనా ఏదైనా మందును కనిపెడుతున్నట్లు ఆ వ్యక్తిని అతడికి తెలిసిన వాళ్ళతో చంపించే విలన్లు ఉండే ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి రీసెర్చర్ జీవితంలో చోటుచేసుకుంది. కరోనా వైరస్ కు మందును కనిపెట్టే పనిలో ఉన్న ఓ శాస్త్రవేత్తను ఓ వ్యక్తి కాల్చి చంపేశాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే రీసర్చ్ శాస్త్రవేత్తను చంపినా వ్యక్తి తనను తానే కాల్చేసుకున్నాడు.

యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ మెడికల్ సెంటర్ రీసెర్చర్ అయిన డాక్టర్ బింగ్ లియు(37).. కరోనా వైరస్ కు మందు కనిపెట్టే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన రీసర్చ్ చివరి దశలో ఉందని తెలుస్తోంది. అతడు రోస్ టౌన్ షిప్ లోని 200 బ్లాక్ ఆఫ్ ఎల్మ్ కోర్ట్ లో నివసిస్తూ ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 46 సంవత్సరాల హావొ గు అనే వ్యక్తి లియు ఇంటిలోకి ప్రవేశించాడు. అతడు తెచ్చుకున్న గన్ తో లియుపై కాల్పులు జరిపాడు. లియు తలలోనూ, మెడలో బుల్లెట్లు దూసుకుపోయాయి.. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో లియు భార్య ఇంట్లో లేదు.

లియుపై కాల్పులు జరిపిన అనంతరం.. హావొ గు పార్కింగ్ లో ఉన్న తన కార్ దగ్గరకు వచ్చి.. తన గన్ తో కాల్పులు జరుపుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. లియు, హావొ గు చాలా కాలం నుండి ఒకరికి మరొకరు బాగా తెలుసు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో పోలీసులకు కూడా తెలీదు. ఈ ఘటనకు పాల్పడడం వెనుక ఉన్న కారణం కూడా ఇంకా గుర్తించలేదు. లియు ఇంటి నుండి ఏవి కూడా దొంగిలించబడలేదని పోలీసులు తెలిపారు.

లియు రీసర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా UPMC కంప్యుటేషనల్ అండ్ సిస్టమ్స్ బయాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. బింగ్ లియు SARS-CoV-2 [COVID-19] పై ఇప్పటికే ప్రయోగాలు చేస్తూ ఉన్నారని.. ఇన్ఫెక్షన్, సెల్యులర్ బేసిస్ పై అతడు రీసర్చ్ చేస్తున్నాడని.. చాలా విషయాలపై అతడు పట్టు సాధించాడని అతడు పనిచేస్తున్న సంస్థ తెలిపింది.

లియు చైనాకు చెందిన వాడు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డీ చేశాడు. పిట్స్ బర్గ్ లోని కార్నేజీ మెలన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్ట్రల్ స్టడీస్ ను పూర్తీ చేశాడు. డాక్టర్ బింగ్ లియు ఓ మంచి రీసెర్చర్ అని.. అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని సన్నిహితులు తెలిపారు.

Next Story