సాయి పల్లవి ఆ పాత్ర పోషించడం లేదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 8:23 AM GMT
సాయి పల్లవి ఆ పాత్ర పోషించడం లేదు..!

టాలీవుడ్ సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విరాట పర్వం కూడా ఒకటి. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి ఆమె పోషించే పాత్ర విషయంలో అనేక ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా 1990ల్లో చోటుచేసుకున్న నక్సల్స్ ఉద్యమ నేపథ్యంలో చోటుచేసుకుంది. సాయి పల్లవి ఈ సినిమాలో బెల్లి లలిత పాత్రను పోషిస్తోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. 'బెల్లి లలిత' నక్సల్స్ ఉద్యమంలో పాలు పంచుకోవడమే కాకుండా సింగర్ కూడా.. ఆమెను 1990లో చంపేశారు. ఈ పాత్రపై విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల క్లారిటీ ఇచ్చాడు. బెల్లి లలిత పాత్రను సాయి పల్లవి పోషిస్తోంది అనడంలో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.

'నేను వరంగల్ జిల్లాకు చెందిన వాన్నే, చాలా వరకూ ఉద్యమాలు వరంగల్ లోనే ప్రాణం పోసుకున్నాయి. నేను ఎదుగుతున్న సమయంలో ఉద్యమానికి సంబంధించిన ఎన్నో ఘటనల గురించి తెలుసుకున్నాను. చాలా సంఘటనలు విరాటపర్వంలో ఉన్నాయి. సాయి పల్లవి విరాటపర్వంలో బెల్లి లలిత పాత్రను పోషించడం లేదు.. కానీ ఆమె పాత్ర సినిమాలో ఎంతో ముఖ్యమైనది. ఆమె ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది' అని వేణు ఉడుగుల చెప్పారు.

రానా దగ్గుబాటి ఈ సినిమాలో ముఖ్య భూమికను పోషిస్తూ ఉన్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. విరాట పర్వం సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. కానీ ఆ షూటింగ్ కు దాదాపు 300 మంది అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం చాలా తక్కువ మందిని పెట్టుకుని షూటింగ్ చేయాలని మాత్రమే సడలింపులు ఇచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమందిని పెట్టి షూటింగ్ చేయాలంటే వీలయ్యే పని కాకపోవడంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. ఇంకొద్ది రోజులు ఆగితే తప్ప భారీ చిత్రాల షూటింగ్ మొదలయ్యేలా కనిపించడం లేదు. విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

Next Story