రోహిత్‌కు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలి.. ఎందుకంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 May 2020 5:28 PM ISTప్రస్తుతం టీమిండియాకు మూడుఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్ కోహ్లీపై పనిభారాన్ని తగ్గించాలని భారత మాజీ పాస్ట్ బౌలర్ అతుల్ వాసన్ అన్నారు. అంతేకాకుండా భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్ల విధానాన్ని అమలు చేయాలని సూచించాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ అప్పగించాలని అబిప్రాయం వ్యక్తం చేశాడు. అలా చేస్తే టెస్టులు, వన్డేల్లో కోహ్లీకి కెప్టెన్సీ సులువవుతుందని అన్నాడు.
కోహ్లీకి వర్క్ లోడ్ దృష్ట్యా మెనేజ్ మెంట్ జట్టుకు స్ల్పిట్ కెప్టెన్ విధానాన్ని అమలు చేయడంపై ఆలోచన చేయాలని అతుల్ స్పోర్ట్స్ క్రీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ మూడు ఫార్మట్‌లలో రాణించి ఉండవచ్చు.. కానీ రోహిత్ కూడా ఐపీఎల్ ముంబయి జట్టును అద్భుతంగా ముందుకు నడుపుతూ.. మంచి కెప్టెన్‌గా ఆరితేరాడన్నాడు. అందుకే విరాట్ నుండి రోహిత్‌కు టీ20 బాధ్యతలు అప్పగించి.. కోహ్లీ పనిభారాన్ని తగ్గించాలని చెప్పుకొచ్చాడు.
ఇదిలావుంటే.. రోహిత్‌కు కెప్టెన్‌గా టీ20ల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ 19 టీ20లల్లో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. 15 విజయాలు అందించాడు. అలాగే.. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగు టైటిళ్లను గెలుచుకుంది. అలాగే కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సమయంలో.. కెప్టెన్‌గా పగ్గాలందుకున్న రోహిత్.. నిదహాస్ ట్రోఫీ, ఆసియాకప్ 2018 టైటిళ్లను కూడా అందించాడు.
ఇక రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. 37 మ్యాచ్‌ల్లో 22 విజయాలే అందించాడు. అలాగే.. కోహ్లీ సారథిగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క ట్రోఫీ కూడా అందుకోకపోవడం గమనార్హం. గణాంకాలు రోహిత్‌కు అనుకూలంగా ఉండటంతో చాలామంది అతుల్ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వచ్చే రెండేళ్లలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు జరుగనున్న క్రమంలో.. సునీల్ జోషీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.