ధోని రీఎంట్రీ పై రోహిత్ సెటైర్స్..
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 5:50 PM ISTటీమ్ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లికించుకున్నాడు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు(2007 టీ20, 211 వన్డే ప్రపంచకప్) లు అందించాడు. 2019 ప్రపంచకప్ తరువాత క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు మహేంద్రుడు. బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ధోని పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో రిటైర్‌మెంట్ గురించే గత ఎనిమిది నెలలుగా చర్చ జరుగుతోంది. ధోని మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడతాడు అని కొందరు అంటుండగా.. ఇప్పటికే తన చివరి మ్యాచ్‌ను ఆడేశాడు అని మరికొందరు అంటున్నారు. ధోని ఫ్యాన్స్ అయితే.. ధోనీ మళ్లీ జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే.. ధోని తన భవితవ్వం గురించి ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పలేదు.
ఇక ధోని కెప్టెన్సీలోనే అరంగేట్రం చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన హిట్‌మ్యాన్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇప్పటికే.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్, భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌లతో కలిసి లైవ్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాజాగా భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఇన్‌స్గాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. అభిమానుల అడిగిన పలు ప్రశ్నలకు హిట్‌మ్యాన్ సమాధానం చెప్పాడు. ధోని గురించి ఓ అభిమాని అడుగగా.. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
మహి క్రికెట్ ఆడడం ఆపేసే ఎవరికి దొరకడు. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. ఎవ్వరితోనూ కాంటాక్ట్‌లో ఉండడు. రాంచీలో ఉంటాడని అందరికి తెలుసు. నువ్వు ఓ పని చేయ్.. ప్రస్తుతం లాక్‌డౌన్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్లకు. లాక్‌డౌన్ ముగిసాక.. కారులోగానీ, బైక్‌గానీ, విమానంలోగాని నేరుగా రాంచీ వెళ్లు. ధోని ఇంటికి వెళ్లి.. ఈ విషయాన్ని ధోనినినే డైరెక్టుగా అడుగు. వరల్డ్‌కప్ తరువాత మాకైతే ధోని గురించి ఎలాంటి సమాచారం తెలీదు. కనీసం ఐడియా కూడా లేదు. అని రోహిత్ సమాధానం ఇచ్చాడు.
ధోని గురించి భారత ఆటగాళ్లను పదే పదే అడుగుతూ అభిమానులు విసుగుతెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే..ఐపీఎల్ లో ధోని తన ఫామ్‌ను నిరూపించుకుంటేనే ప్రపంచకప్ జట్టులో ఆడతాడని ఇటీవల టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి అన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ధోని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.