13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2020 1:39 PM GMT
13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా..

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని, దినేశ్ కార్తీక్‌లు స‌మ‌కాలీన క్రికెట‌ర్లు. ధోని క్రికెట్‌లో త‌న‌దైన ముద్ర వేయ‌గా.. దినేశ్ కార్తీక్ మాత్రం ఆడ‌పాద‌డ‌పా జ‌ట్టులోకి వ‌చ్చిపోతుండేవాడు. ధోని కెప్టెన్‌గానే కాక వికెట్ కీప‌ర్‌గానూ అద‌ర‌గొట్ట‌డంతో.. దినేశ్ కార్తీక్ కు భార‌త జ‌ట్టులో చోటు ల‌భించేది కాదు. ఎప్పుడో ధోనీ గాయ‌ప‌డితేనో.. ధోనికి రెస్టు ఇవ్వాల‌ని అనుకున్న‌ప్పుడో మాత్ర‌మే కార్తీక్‌కి అవకాశం ద‌క్కేది.

తాజాగా దినేశ్ కార్తీక్ ఓ ఆస‌క్తిక విష‌యాన్ని పంచుకున్నాడు. ఇక త‌న‌ను కాద‌ని ధోని తీసుకున్న‌ప్పుడు త‌న గుండెల్లో గున‌పం దిగిన‌ట్లైంద‌ని వెల్ల‌డించాడు ఈ వికెట్ కీప‌ర్‌. ఈ సంఘ‌ట‌న 2008లో జ‌రిగింద‌ని చెప్పాడు. 2008లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) వేలం జ‌రిగింది. అప్పుడే ఈ లీగ్ కొత్త‌గా ఆరంభం అవుతుంది. ఎవ‌రి రాష్ట్రాల‌కు చెందిన వారిని ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ సౌరవ్ గంగూలీ ని, ముంబై ఇండియన్స్ సచిన్ టెండూల్కర్ ను, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఆఫ్ బెంగ‌ళూరు ద్రావిడ్ ను తీసుకున్నాయి. నేను త‌మిళ‌నాడుకు చెందిన వ్య‌క్తిని. చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా త‌మిళ‌నాడుకు చెందిందే కాబట్టి న‌న్ను మొద‌టి ప్లేయ‌ర్‌గా తీసుకుంటార‌ని భావించా. నేను అప్పుడు జాతీయ జ‌ట్టులో కూడా ఆడుతుండ‌డం అందుకు కార‌ణం. అయితే.. అనూహ్యంగా మ‌హేంద్ర సింగ్ ధోనిని తీసుకుంది. ఆ క్ష‌ణంలో త‌న‌ను కాద‌ని.. మ‌హీని తీసుకున్న‌ప్పుడు త‌న గుండెల్లో గున‌పం దిగిన‌ట్లు అయింద‌ని వెల్ల‌డించాడు ఈ భార‌త క్రికెట‌ర్‌. ప్ర‌స్తుతం కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ గా ఉన్న‌ కార్తీక్.. త‌న సొంత రాష్ట్ర జ‌ట్టు చెన్నై త‌రుపున ఆడాల‌ని 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు.

‘2008 ఐపీఎల్ సీజన్ వేలం సమయంలో నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాను. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తమిళనాడుకి చెందినది కావడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన నేను అప్పటికే టీమిండియాలో ఆడుతుండటంతో నన్ను ఫస్ట్ కొనుగోలు చేస్తారని ధీమాగా ఉండిపోయాను. అయితే.. కెప్టెన్సీ ఇస్తారా లేదా అని మాత్రమే సందేహం ఉండేది. కానీ అనూహ్యంగా ధోనిని కొనుగోలు చేశారు. ఆ టైమ్‌‌లో ధోని నా పక్కనే కూర్చుని ఉన్నాడు. దీని గురించి అతను ఓ మాట కూడా చెప్పలేదు. బహుశా ధోనీ కూడా ఆ ఎంపికను ఊహించలేదనుకుంటా. నన్ను కాదని ధోనిని ఎంపిక చేయడం చాలా బాదేసింది’ అని దినేశ్‌ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో ఆరు ఫ్రాంచైజీలు(ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్‌క‌త్తా నైట్‌రైడ‌ర్స్‌) మారాడు కార్తీక్‌.. మ‌రి త‌ను అనుకున్న‌ట్లు చెన్నై త‌రుపున ఆడే అవ‌కాశం ల‌భిస్తుందో లేదో.

Next Story
Share it