అందుకు అభిమానులు ఒప్పుకోరు : రోహిత్ శ‌ర్మ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2020 11:09 AM GMT
అందుకు అభిమానులు ఒప్పుకోరు : రోహిత్ శ‌ర్మ‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రీడారంగం కుదేలైంది. ఈ మ‌హ‌మ్మారి ముప్పుతో ప‌లు క్రీడాటోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.

అయితే.. కొంద‌రు మాత్రం ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని సూచిస్తున్నారు. దీనిపై భార‌త ప‌రిమిత ఓవ‌ర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించారు. ఖాళీ స్టేడియంలో మ్యాచులు ఆడటాన్ని అభిమానులు ఒప్పుకోర‌ని తాను అనుకుంటున్నాన‌ని, బోర్డు ఏ నిబంధ‌న‌ల‌తో ముందుకు వ‌స్తుందో వాటిని పాటించ‌క త‌ప్ప‌ద‌న్నారు. త‌న చిన్న‌త‌నంలో ఎవ‌రూ లేని చోట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిన‌ని, ప్ర‌స్తుతం అదే ప‌రిస్థితి రావొచ్చున‌ని చెప్పాడు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తే.. క‌నీసం అభిమానులు టీవీలో అయినా.. చూడొచ్చు అని.. అది కాస్త ఊర‌ట‌నిచ్చే అంశమ‌న్నాడు. ఐపీఎల్‌కు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు మనమందరం ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల కోసం వేచి ఉండాలని రోహిత్ పేర్కొన్నాడు.

మున‌ప‌టిలా ఉండ‌దు..

ఈ ఏడాది చివ‌ర్లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నుంది. దీనిపై హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్న‌ర్ ల రాక‌తో ఆస్ట్రేలియా జ‌ట్టు బ‌లం పెరిగిందన్నాడు. ఈ సారి సిరీస్ కాస్త భిన్నంగాను జ‌రుగుతుంద‌ని, మున‌ప‌టిలా ఉంద‌ని రోహిత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 2018–19లో వాళ్లిద్దరిపై నిషేధం ఉండటంతో ఆడలేకపోయారు. భారత్‌ 2–1తో టెస్టు సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చి ఈ సిరీస్‌ను ఆడనిస్తే తప్పకుండా భారత్, ఆసీస్‌ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందని రోహిత్‌ శర్మ అన్నాడు.

Next Story
Share it