బీడబ్ల్యూఎఫ్ రాయబారిగా పీవీ సింధు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2020 7:48 AM GMT
బీడబ్ల్యూఎఫ్ రాయబారిగా పీవీ సింధు

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమం ‘ఐ యామ్‌ బ్యాడ్మింటన్‌’కు అంబాసిడర్‌గా ఎంపికైంది. సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్‌ సీ వీయ్, హంగ్‌ యా కియాంగ్‌ (చైనా), జాక్‌ షెఫర్డ్‌ (ఇంగ్లండ్‌), వలెస్కా ఖోబ్‌లాచ్‌ (జర్మనీ), చాన్‌ హో యున్‌ (హాంకాంగ్‌), మార్క్‌ జ్విబ్లెర్‌ (జర్మనీ) లు రాయ‌బారులుగా ఎంపిక‌య్యారు. ఈ క్రీడాకారులంద‌రూ ఆట ప‌ట్ల త‌మ‌కు ఉన్న ప్రేమ‌, గౌర‌వాన్ని, నిజాయితీగా ఆడ‌డం వంటి అంశాల‌పై అవ‌గాహాన క‌ల్పించ‌నున్నారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ .." ఏ క్రీడ‌లోనైనా నిజాయితీగా ఆడ‌డం అనేది ఎంతో ముఖ్యం. నీకు న‌చ్చిన ఆట‌నే నువ్వు ఎంచుకుంటావు. అందువ‌ల్ల దాన్ని ఆడేట‌ప్పుడు నువ్వు ఎక్కువ ఆనందాన్ని పొందాలి. ఆటలో నిజాయితీగా ఉండాలి. అదే నాకు ముఖ్యం. అంబాసిడర్లుగా ఈ విషయాన్ని మేం మరింత బాగా ఆటగాళ్లలోకి తీసుకెళ్లాలని" ఈ హైద‌రాబాదీ అమ్మాయి చెప్పింది.

బ్యాడ్మింట‌న్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌, డోపింగ్‌ల నిరోధంపై వ‌ర్థ‌మాన క్రీడాకారుల్లో అవ‌గాహాన క‌ల్పించ‌డం కోస‌మే ఐ యామ్ బ్మాడ్మింట‌న్ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న‌ట్లు బీడబ్ల్యూఎఫ్ వెల్ల‌డించింది. 2016 నుంచి ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు పౌల్‌ ఎరిక్‌ హోయర్, బీడబ్ల్యూఎఫ్‌ పారాలింపిక్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రిచర్డ్‌ పెరోట్, బ్యాడ్మింటన్‌ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్‌ అక్సెల్‌సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్‌ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి ముందుండి నడిపిస్తున్నారు.

Next Story