క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన అల్లుడిని చూసేందుకు వెలుతూ బంధువులు మృతి
By తోట వంశీ కుమార్ Published on 2 Aug 2020 2:14 PM ISTవిశాఖలో శనివారం షిప్‌యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ప్రమాదంలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు కారులో వెలుతున్న ఓ కుటుంబం.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.
క్రేన్ ప్రమాదంలో తమ అల్లుడు పి.భాస్కరరావు చనిపోయాడని తెలిసి ఖరగ్‌పూర్‌కు చెందిన నాగమణి(48), ఆమె ఇద్దరు కొడుకులు రాజశేఖర్, ఈశ్వరరావు, ఇద్దరు కోడళ్లు పెతిలి, లావణ్య(23)లో కలిసి కారులో విశాఖకు బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్నకారు శ్రీకాకుళం జిల్లా జలంతర కోట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రౌతుద్వారక(23), నాగమణి, లావణ్య లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్, పెతిలికి స్వల్పగాయాలు కాగా.. ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. సోంపేటలో ఫస్ట్ ఎయిడ్ అనంతరం వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.