రియా చక్రవర్తి అరెస్ట్.. బాలీవుడ్ కు చెందిన 25 మంది పేర్లు బయటకు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sept 2020 3:49 PM IST
రియా చక్రవర్తి అరెస్ట్.. బాలీవుడ్ కు చెందిన 25 మంది పేర్లు బయటకు..!

బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు ఎన్.సి.బి. అధికారులు. రియా చక్రవర్తిని ప్రస్తుతం మెడికల్ టెస్టు కోసం తీసుకుని వెళ్లనున్నారు. డ్రగ్స్ విషయంలో తప్పించుకోవాలని రియా చేసిన అన్ని ప్రయత్నాలు దెబ్బకొట్టాయి. సుశాంత్ సింగ్ కుటుంబం చేసిన పనుల వలనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని రియా చక్రవర్తి తెలిపింది. ముంబై పోలీసులకు కూడా సుశాంత్ సోదరిపై ఫిర్యాదు చేసింది.

తాను ఇప్పటివరకూ డ్రగ్స్ ను తీసుకోలేదని.. సుశాంత్ కోసం డ్రగ్స్ ను కొన్నానని అంగీకరించింది. డ్రగ్స్ విషయంలో రియా చక్రవర్తి తమ్ముడు షోవిక్ చక్రవర్తి అరెస్టు అయ్యాడు. బాలీవుడ్ కు చెందిన 25 మంది సెలెబ్రెటీల పేర్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. వారందరికీ ఎన్.సి.బి. అధికారులు సమన్లను జారీ చేయనున్నారు.

రియా చక్రవర్తిని విచారించే సమయంలో కూడా పలువురు బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల పేర్లు తెలిపింది. బాలీవుడ్ పార్టీలలో చోటుచేసుకునే పరిణామాల గురించి కూడా ఆమె ఎన్.సి.బి. అధికారులకు వివరించింది. మరో 10-15 రోజుల్లో వీరందరికీ సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రియా తాను అరెస్టు కాబోతున్నానని ముందే ఊహించింది. సోమవారం నాడు సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి కేసును పెట్టింది. ప్రియాంక సింగ్ బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను తీసుకుని వచ్చిందని.. ఫోర్జరీ కేసును పెట్టింది రియా. సుశాంత్ ప్రియాంక సింగ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కారణంగా అయిదు రోజుల తర్వాత మరణించాడని రియా కేసులో పేర్కొంది. ప్రియాంక సింగ్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్ లు కలిసి సుశాంత్ కు వేరే మందులు ఇచ్చారని రియా చెబుతోంది. ఈ విషయంలో ఫోర్జరీ చేసుకుందని.. తప్పుడు ప్రిస్క్రిప్షన్ కారణంగా సుశాంత్ ప్రాణాలు కోల్పోయాడని ముంబై పోలీసులకు తన ఫిర్యాదులో తెలిపింది రియా.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం తాను డ్రగ్స్ కొన్నట్టు ఆమె అంగీకరించింది. తాను అతనికి డ్రగ్స్ ఇచ్చానని, తాను మాత్రం వాటిని వినియోగించలేదని చెప్పింది. కేదార్ నాథ్ సినిమా సెట్లలోనే సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. తన సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆమె అధికారులకు తెలిపింది. ఈ కేసును మరింత లోతుగా విచారించే క్రమంలో ఆమెను అరెస్ట్ చేశారు అధికారులు. ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని, మిరండాలను అరెస్ట్ చేశారు.

Next Story