ఆదిత్య థాక్రే.. రియా చక్రవర్తికి ఎలాంటి పరిచయం లేదట..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Aug 2020 4:07 PM IST

ఆదిత్య థాక్రే.. రియా చక్రవర్తికి ఎలాంటి పరిచయం లేదట..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదని హత్య అని ఎంతో మంది ఆరోపిస్తూ ఉన్నారు. ఆదిత్య థాక్రే పేరు కూడా ఈ కేసులో వినిపించడంతో రాజకీయంగా దుమారం కూడా రేగింది. శివసేన యువ నేతను ఈ కేసులో ఇరికించాలని కావాలనే ప్రయత్నిస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా రియా చక్రవర్తి తరపు లాయర్ ఇప్పటి వరకూ ఆదిత్య థాక్రేను ఆమె కలవలేదని చెబుతూ ఉన్నారు. రియా చక్రవర్తి ఆదిత్య థాక్రేను ఎన్నడూ కలుసుకోలేదని ఆమె న్యాయవాది సతీష్‌ మనేషిండే అన్నారు. ఆదిత్యా థాక్రేతో రియాకు పరిచయం లేదని చెప్పుకొచ్చారు. జూన్‌ 8న సుశాంత్‌ నివాసం నుంచి రియా బయటకు వచ్చారని తెలిపారు. ఇక సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు బిహార్‌ పోలీసుల పరిధిలో లేకపోవడంతో వారి దర్యాప్తునకు రియా చక్రవర్తి స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.

తమ విచారణకు సహకరించాలని రియాను కోరకుండానే బిహార్‌ పోలీసులు ముంబై చేరుకున్నారని.. రాజకీయ నేతల ప్రోద్బలంతోనే బిహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అన్నారు. రియా చక్రవర్తి‌ ఏ దర్యాప్తు సంస్థకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

చట్ట ప్రకారం బిహార్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తును ముంబై పోలీసులకు బదలాయించాలని, ఈ కేసు పరిధి బిహార్‌ పోలీసుల పరిమితిలో లేదని చెప్పారు రియా న్యాయవాది.

Next Story