సుశాంత్‌ను ప్రేమించడం వలనే ఈ కష్టాలు : రియా చక్రవర్తి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Aug 2020 3:14 PM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే..! ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియా చక్రవర్తి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రియాపై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టిని సారించిన సంగతి తెలిసిందే. ఆమె అక్రమంగా డబ్బు తరలించిందని ఈడీ, డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) కేసులను రిజిస్టర్ చేశాయి.
కొందరైతే బహిరంగానే రియాను దోషి అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సుశాంత్ ను ప్రేమించడం వలనే తనకు కష్టాలు ఎదురయ్యాయంటూ రియా చక్రవర్తి చెప్పినట్లుగా బాలీవుడ్ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
ఓ న్యూస్ పోర్టల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రియా, తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు సుశాంత్ ను ప్రేమించడమేనని.. అదే తననిప్పుడు కష్టాల్లోకి నెట్టిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. తనను ఏ విచారణ సంస్థ ఇంటరాగేషన్ చేసినా, దాచి పెట్టేందుకు తన వద్ద ఏమీ లేదని తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని వ్యాఖ్యానించింది.
సీబీఐ విచారణలో డ్రగ్స్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు తేలడంతో రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఆమె తరపు లాయన్ దీనిపై మాట్లాడుతూ రియా ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. రక్త పరీక్షలు నిర్వహిస్తే విషయం తేలిపోతుందని, బ్లడ్ టెస్ట్ కు రియా సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. సీబీఐ కూడా తన విచారణలో డ్రగ్స్ కోణాన్ని పరిగణనలోకి తీసుకోబోతోందని తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో సుశాంత్ తండ్రి మరోసారి రియా చక్రవర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియా తన బిడ్డను చంపిన హంతకురాలని.. ఆమె అనుచరులపైనా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు. రియా గ్యాంగ్ ను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. చాలారోజులుగా తన కుమారుడు సుశాంత్ కు రియా విషం ఇస్తోందని ఆరోపించారు.
తన కుటుంబానికి రక్షణ కరువైందంటూ రియా చక్రవర్తి సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్టు చేసింది. రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి కారులో నుండి దిగగానే మీడియాకు చెందిన వాళ్ళు చుట్టుముట్టారు. ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. ఈడీ, సిబిఐ విచారణలు తాము హాజరవుతూ ఉన్నామని తెలిపింది. నాకు, నా కుటుంబానికి రక్షణ కావాలని పోలీసులను సంప్రదించాము.. కానీ ఎవరూ స్పందించలేదు. మా కుటుంబానికి రక్షణ కావాలి అని ఆమె కోరింది. కోవిద్ సమయంలో కనీసం లా అండ్ ఆర్డర్ పరిమితులు ఉంటాయని.. మైక్ లతో తన తండ్రిని చుట్టుముట్టిన మీడియాను ఉద్దేశించి పోస్టు పెట్టింది రియా.