గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 5:50 AM GMT
గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లీ

భారత కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ( Virat Kohli ) త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విరాట్‌ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆయన భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ( Anushka Sharma ) ప్రస్తుతం గర్భవతి అని తెలిపాడు. జనవరి 2021లో అనుష్క బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిపాడు. ఆ పై మేం ముగ్గురం అంటూ ట్వీట్‌ చేశాడు కోహ్లీ. కాగా.. ఇప్పటికే భారత ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా తండ్రైన విషయం తెలిసిందే.

2017లో డిసెంబర్‌ 11న ఇటలీలో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విరుష్క జంట.. పెళ్లి తర్వాత కూడా ఆ లవ్ జర్నీని కొనసాగిస్తూ కొత్త జంటలకు స్పూర్తిగా నిలుస్తోంది. అభిమానులు ఈ ఇద్దరి జోడీని విరుష్క అని పిలుస్తారు. ప్రస్తుతం ఇండియాలో విరుష్క జోడీని మించిన అత్యంత ప్రభావవంతమైన, అత్యంత అందమైన కపుల్ మరొకరు లేరు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఈ ఇద్దరు పెట్టే ఫోటోలు,పోస్ట్‌లు చూస్తే ఎవరికైనా అసూయ పుట్టాల్సిందే. బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్తకు, తనకు మధ్య దృఢమైన బంధానికి గల కారణాలను, ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఇతర ఆసక్తికరమైన ఘటనలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఇక విరాట్‌ తండ్రి కాబోతుండడంతో ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనేందుకు విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్‌ ప్రారంభం కానుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆఫ్‌ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని కృత నిశ్చయంతో బెంగళూరు టీమ్‌ ఉంది.Next Story