ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ముందు హాజరైన రియా చక్రవర్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 12:59 PM IST
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ముందు హాజరైన రియా చక్రవర్తి

నటి రియా చక్రవర్తి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు ముంబైలో హాజరైంది. సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ ప్రక్రియను వాయిదా వేయాలని రియా చక్రవర్తి చేసిన అభ్యర్థనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒప్పుకోకపోవడంతో ఆమె ఈరోజు హాజరవ్వక తప్పలేదు.

ఉదయం 11.30 వరకూ వేచిచూస్తామని.. అప్పటికీ ఆమె హాజరుకాని పక్షంలో మళ్లీ తాజా సమన్లు జారీ చేస్తామని ఈడీ అధికారులు చెప్పడంతో ఆమె ముంబైలో ఈరోజు ప్రత్యక్షమైంది.

రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని, సుశాంత్‌ను రియా మానసికంగా ఎంతో వేదనకు గురిచేసిందని సుశాంత్ తండ్రి రియా చక్రవర్తిపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ కేసులో రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలో దిగింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌రారీలో ఉంద‌ని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు. కేసు విచార‌ణలో ఆమె ఏ మాత్రం స‌హ‌క‌రించ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే..! ఇంతలో ఆమె ముంబైలో ప్రత్యక్షమైంది.

సుశాంత్ మరణంపై ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణ మొదలవ్వగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో రియా, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు షోయిక్ తో పాటు మరో ఇద్దరి పేర్లను చేర్చింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకి ప్రేరేపించడం, అక్రమ నిర్బంధం, అక్రమ అధీనంలో ఉంచుకోవడం, తస్కరణ, నేరపూరిత విశ్వాస ఘాతుకం, మోసం, నేరపూరితంగా భయకంపితుడ్ని చేయడం వంటి ఆరోపణలు మోపారు.

సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన ఫిర్యాదులో రియా చక్రవర్తిపై ఆరోపణలు చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు సంబంధించిన ఖాతాల్లోకి కోట్ల రూపాయలు తరలించిందని, రియా మానసిక వేధింపులే సుశాంత్ బలవన్మరణం పాలయ్యేలా చేశాయని తెలిపారు.

Next Story