ఎన్నెన్ని కోణాలో.. రియాపై సీబీఐ ఎఫ్ఐఆర్.. 5 రోజుల్లో 25సార్లు అతడికి ఫోన్ కాల్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 1:21 AM GMT
ఎన్నెన్ని కోణాలో.. రియాపై సీబీఐ ఎఫ్ఐఆర్.. 5 రోజుల్లో 25సార్లు అతడికి ఫోన్ కాల్స్

సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ముంబై పోలీసులు చెబుతున్నా తమకు మాత్రం అనుమానాలున్నాయని సుశాంత్ కుటుంబసభ్యులు చెబుతూ ఉన్నారు. సుశాంత్ రాజ్ పుత్ మరణం విషయంలో ముంబై పోలీసులు ఏదో దాస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సుశాంత్ మరణంపై ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు.

ఈ కేసులో సీబీఐ విచారణ మొదలవ్వగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో రియా, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు షోయిక్ తో పాటు మరో ఇద్దరి పేర్లను చేర్చింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకి ప్రేరేపించడం, అక్రమ నిర్బంధం, అక్రమ అధీనంలో ఉంచుకోవడం, తస్కరణ, నేరపూరిత విశ్వాస ఘాతుకం, మోసం, నేరపూరితంగా భయకంపితుడ్ని చేయడం వంటి ఆరోపణలు మోపారు.

సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన ఫిర్యాదులో రియా చక్రవర్తిపై ఆరోపణలు చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు సంబంధించిన ఖాతాల్లోకి కోట్ల రూపాయలు తరలించిందని, రియా మానసిక వేధింపులే సుశాంత్ బలవన్మరణం పాలయ్యేలా చేశాయని తెలిపారు. ముంబయి పోలీసులు సుశాంత్ కేసులో రియాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రియా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆధారాల్లేవని వారు స్పష్టం చేశారు.

ఓ మీడియా సంస్థ రియా ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించడం సంచలమైంది. రియా, ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్‌ను బలవంతంగా మానసిక వైద్యశాలకు పంపించాలని చూసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుశాంత్‌ జనవరి 20 నుంచి 24వ తేదీల్లో చండీఘర్‌లో సుశాంత్ తన సొదరి రాణితో ఉన్నప్పుడు.. 5 రోజుల్లో దాదాపు 25 సార్లు రియా సుశాంత్‌కు ఫోన్‌ చేసింది. గతేడాది డిసెంబర్‌లో‌ సుశాంత్‌ ఫోన్‌ నెంబర్‌ మార్చారని.. ఆ నెంబర్‌ నుంచి సుశాంత్‌ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రియా, రియా కుటుంబ సభ్యులు తనని మానసిక వైద్యశాలలో చేర్పించేందుకు కుట్ర చేస్తున్నారని, అది తనకు ఇష్టం లేదని చెప్పి​ బాధపడ్డాడని కూడా కథనాలు వస్తున్నాయి. సుశాంత్‌ ముంబై వదిలి హిమాచల్‌ ప్రదేశ్‌లో స్థిరపడాలని నిర్ణయించుకోవడంతో.. 2020లో చండీఘర్‌లోని తన సోదరి రాణి ఇంటికి వెళ్లీనప్పుడు రియా పదే పదే ఫోన్‌ చేసిందని.. తన దగ్గరికి తిరిగి రావాలని, అడిగినట్లు కాల్‌ డేటా ద్వారా స్పష్టంగా తెలుస్తోంది మీడియా కథనాల్లో తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఇంకా ఎన్నెన్ని కోణాలు బయటపడతాయో చూడాలి..!

Next Story