ఊరట లేదు.. పొడిగింపు ఉండదు.. ఫేస్ చేయటానికి సిద్ధం కండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 7:12 AM GMT
ఊరట లేదు.. పొడిగింపు ఉండదు.. ఫేస్ చేయటానికి సిద్ధం కండి

మరో రోజులో ఆగస్టు ముగియనుంది. మామూలుగా అయితే.. ఆగస్టు ముగిసి.. సెప్టెంబరులోకి వెళుతున్నామంటే చాలామంది ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే దసరా బోనస్ ఊరిస్తూ ఉండేది. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. కరోనా వేళ.. ఇప్పుడు రోజులన్ని ఒకేలా ఉంటున్నాయి. ముఖానికి మాస్కు పెట్టుకోవటం.. భౌతిక దూరం పాటించటమే కాదు.. ఎక్కడకు వెళ్లే పరిస్థితి లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా నేపథ్యంలో పలువురికి ఉద్యోగాలు పోవటం.. వ్యాపారాలు మూతపడటం.. జీతాల్లోకోత పడటం లాంటివి చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నా.. సాధారణ పరిస్థితి చోటు చేసుకోవటానికి మరిన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక.. లాక్ డౌన్ వేళ ఆర్‌బీఐ ఇచ్చిన రుణాల చెల్లింపు వాయిదా వేస్తూ మారిటోరియంను ప్రకటించారు. అయితే.. దీనికి సంబంధించిన నిబంధనల లోతుల్లోకి వెళితే.. మారిటోరియం తీసుకునే బదులు.. కాస్త కష్టమైనా ఈఎంఐలు తీర్చేస్తే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టటం కష్టమైన పనిగా పలువురు అభివర్షిస్తున్నారు. ఆర్నెల్లుగా సాగుతున్న మారిటోరియంను కొనసాగే అవకాశం లేనట్లేనని తేలిపోయింది. అంటే.. మరో రోజుతో మొదలయ్యే సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటోరియంను ఎట్టి పరిస్థితుల్లో పొడిగించకూడదని పలు బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. సామాన్యుడి ఈతి బాధలు మరింత ఎక్కువ కావటం ఖాయమంటున్నారు.

కరోనా షురూ అయి ఆర్నెల్లు పూర్తి అవుతున్నా.. ఇప్పటికి వ్యవహారం ఒక కొలిక్కి రాకపోగా.. కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరగటమేకానీ తగ్గట్లేదు. ఓవైపు కరోనా ముప్పు.. మరోవైపు ఆర్థిక సమస్యలతో సామాన్యుడి బతుకు ఆగమాగంగా మారింది. తీసుకున్నరుణాల్ని గడిచిన ఆర్నెల్లుగా కట్టని వారు.. ఇప్పుడు కట్టాల్సి రావటం కాస్త కష్టమే. అలా అని వదిలేయలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఖర్చుల్లో కోత.. రుణాల్ని తిరిగి చెల్లించే విషయంలో మరింతగా ప్లాన్ చేసుకోవాలి. చెల్లింపుల వెసులుబాటు లేని వారు.. వర్తమానంలో టెన్షన్ పెట్టుకునే కన్నా.. భవిష్యత్తులో కాస్త భారాన్ని పెంచుకోవటం మంచిదంటున్నారు. అయితే.. ఇదంతా ఆర్థిక కష్టాలు ఉన్న వారికి మాత్రమే. అందుకు భిన్నంగా ఉన్నోళ్లు.. రుణాల్ని తిరిగి చెల్లించేయటమే ఉత్తతమంగా చెబుతున్నారు.

Next Story
Share it