రూ.2వేల నోటును అప్పటి నుంచి ప్రింట్ చేయట్లేదా?
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 7:21 AM GMTఆసక్తికరమైన అంశం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. యూపీఏ జమానాలో తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం పుణ్యమా అని.. ప్రభుత్వాల ఐరన్ కర్టెన్ల నుంచి కొంత సమాచారం బయటకు వస్తోంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఒకరు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి ఆర్ బీఐ ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం..ఆ సందర్భంగా వెయ్యి.. రూ.500 నోట్ల స్థానంలో.. రూ.2వేలు.. రూ.500 నోట్లను తీసుకొచ్చిన వైనం తెలిసిందే.
నాలుగేళ్ల క్రితం కొత్త నోట్లను విడుదల చేసిన మోడీ సర్కారు.. తర్వాతి కాలంలో తాను తీసుకొచ్చిన రూ.2వేల నోట్లను ప్రింట్ చేయటం ఆపేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఏడాది నుంచి రూ.2వేల నోట్లను ప్రింటింగ్ చేసిందే లేదని చెబుతున్నారు. 2016-17మధ్యలో ఏకంగా రూ.354.29 కోట్ల మొత్తానికి రూ.2వేల నోట్లను ప్రింట్చేయగా.. 2019 నుంచి మాత్రం అందుకు భిన్నంగా నోట్ల ముద్రణను నిలిపేశారు.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గించిన కేంద్రం.. అందుకు భిన్నంగా రూ.500 నోట్ల ముద్రను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016-17తో పోలిస్తే.. గత ఏడాది రెట్టింపు స్థాయిలో రూ.500 నోట్లను ప్రింట్ చేసినట్లుగా తేల్చారు. నాలుగేళ్ల క్రితం రూ.500 నోట్లను 429.22 కోట్లు ముద్రిస్తే.. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏకంగా 822.77కోట్ల నోట్లను అందుబాటులోకి తేవటం గమనార్హం. గతంలో పోలిస్తే రూ.10.. రూ.50.. రూ.100.. రూ.200నోట్ల ప్రింటింగ్ ను కూడా తగ్గించినట్లుగా తేల్చారు. ప్రింటింగ్ ఖర్చుల్ని తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.