అప్పడాలు తింటే కరోనా వైరస్ రాదన్న కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 7:10 AM GMT
అప్పడాలు తింటే కరోనా వైరస్ రాదన్న కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..!

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు కరోనా పాజిటివ్ అని వచ్చిందని అధికారులు శనివారం నాడు ధృవీకరించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్ కోవిద్-19 వార్డులో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. హెవీ ఇండస్ట్రీస్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘవాల్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. ఆయన రెండు సార్లు పరీక్షలు నిర్వహించుకున్నారు. రెండో సారి పరీక్షలో ఆయనకు నెగటివ్ అని వచ్చింది.

తన ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వాళ్ళందరూ టెస్టులు చేయించుకోవాలని.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అర్జున్ రామ్ మేఘవాల్ బికనీర్ నుండి బీజేపీ ఎంపీగా గెలిచారు. జులై నెలలో తాను సూచించిన అప్పడాలు తింటే కరోనా వైరస్ దరిచేరదంటూ అర్జున్ రామ్ మేఘవాల్ చేసిన ప్రకటన సంచలనానికి దారి తీసింది. ఈ విషయం పరంగా ఆయన అప్పట్లో వార్తల్లో నిలిచారు.

అర్జున్ రామ్ మేఘవాల్ ‘భాబీజీ పాపడ్'(అప్పడాలు) తింటే కరోనాను దూరం చేయొచ్చు అని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త స్కీమ్ ఆత్మనిర్భర్ కింద ఈ అప్పడాలను తయారు చేశామని.. ఇవి తింటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా కరోనాతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుందని.. ప్రతిరోధకాలు శరీరంలో పెరుగుతాయని ఆయన చెప్పారు. ఆయన ‘భాబీజీ పాపడ్’ ను ప్రమోట్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచురించాయి. రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ అప్పడాలు తయారు చేస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు పదార్థాలను ఉపయోగించి ఈ అప్పడాలను తయారుచేశారని ఆయన జులై నెలలో తెలిపారు. అప్పడాలు తింటే కరోనా వైరస్ రాదన్న కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తున్నాయి.



పలువురు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడ్డారు. యూనియన్ మినిస్టర్ కైలాష్ చౌదరికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

Next Story