రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘రాయలసీమ’ జల జగడం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Aug 2020 1:36 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య చక్కటి సంబంధాలే ఉన్నాయి. కాకుంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి అంశాలు కంట్లో నలకలా.. పంటి కింద రాయిలా మారాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో షురూ చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూనే ఉంది. ఈ పథకంపై ఏపీ సర్కారు వాదన వేరుగా వినిపిస్తోంది. తాను చేపట్టిన ప్రాజెక్టు కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా ఉండదని వాదిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది.
తాజాగా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు ఉత్తర్వుల్ని రద్దు చేయాలని.. టెండర్ల విషయంలో ఏపీ సర్కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని పేర్కొంది. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని చెబుతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల్ని గమనించిన ఏపీ ప్రభుత్వం ముందుగానే కేవియట్ పిటిషన్లను జారీ చేసింది.
సుప్రీం కోర్టుతో పాటు రెండురాష్ట్రాల్లోని హైకోర్టుల్లోనూ కేవియట్ పిటిషన్లను దాఖలు చేయటం చూస్తే.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల విషయంలో ఏపీ సర్కారు అప్రమత్తంగా ఉందన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. కృష్ణా నీటిని అదనంగా తరలించేలా వచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ విషయంలో తదుపరి ముందుకెళ్లకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇందుకు తగ్గట్లే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు మీద ఏపీ ప్రభుత్వ వాదన ఏమంటే.. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకోవటమే తమ ఉద్దేశమని.. దానికారణంగా తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని సీఎం జగన్ కోరుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మీద కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల్ని చేపట్టరాదని.. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ముందుకు వెళ్లకూడదని పేర్కొంది.
ఈ సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ సర్కారు వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును రద్దు చేయటంతో పాటు.. టెండర్ల విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది.తెలంగాణ ప్రభుత్వ దూకుడును గుర్తించిన ఏపీ ప్రభుత్వం అలెర్టుగా ఉంది. ఈ ప్రాజెక్టును నిలిపివేసేందుకు కేసీఆర్ సర్కారు తీసుకునే నిర్ణయాలకు సమర్థంగా చెక్ చెప్పేందుకు వీలుగా సుప్రీంలోనూ.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. మరి.. న్యాయస్థానాల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.