కేబినెట్‌ భేటీలో 'కేసీఆర్‌' కీలక నిర్ణయాలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 4:35 AM GMT
కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ కీలక నిర్ణయాలు..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు:

1. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

2. హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటి కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ (Growth In Dispersion) పాలసిని కేబినెట్ ఆమోదించింది.

3. పెరిగిపోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ రాష్ర్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.

4. సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజైన్లను ఆమోదించింది.

5. కరోనా వ్యాప్తి – వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స- ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వివిధ విభాగాధిపతులను సమావేశానికి ఆహ్వానించి చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కరోనా పరిస్థితిపై వివరాలు అందించారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాలు రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు.

ప్రజలు పెద్దగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేబినెట్ కోరింది. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎన్ని డబ్బులైన వెనకాడేది లేదని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నది.

- రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసి విర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

- పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది.

- రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.

- కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

- ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి.

- ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది.

- ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

- మంత్రి ఈటల రాజెందర్, సిఎస్ సోమేశ్ కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల్లో అవసరాలు తెలుసుకుంటారు. వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటారు.

6. ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను రాష్ట్ర కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనాశీలతకు నిదర్శనమని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. గత వానాకాలంలో రాష్ట్రంలో కోటి 22 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతున్నదని వారు వివరించారు. తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల దిగుబడి పెరగడం పట్ల కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యవసాయం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఇటీవల ఎఫ్.సి.ఐ. సేకరించిన ధాన్యంలో రాష్ట్రం వాటా 55 శాతంగా తేలడం ఈ విషయం నిరూపించిందని కేబినెట్ అభిప్రాయపడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న రైతుబంధు ద్వారా ఈ వానాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకు నగదు సహాయం అందిందని, కరోనా కష్టకాలంలో ఇది రైతులకు పెద్ద సహాయంగా ఉపయోగపడిందని మంత్రులు అన్నారు. కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, రూ.7,251 కోట్ల రూపాయలు అందించడం అసాధారణమని పేర్కొన్నారు. ఇంకా ఎక్కడైనా రైతులు మిగిలిపోయినా వారిని గుర్తించి సహాయం అందించాలని అధికారులను కోరింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల గణన చేపట్టాలని, ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాలని అధికారులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సిఎం కోరారు. రైతు వేదికలకు స్థలం ఇచ్చినా, నిర్మాణానికి నిధులు ఇచ్చినా వారు సూచించిన వారి పేరును వేదికకు పెట్టాలని సిఎం ఆదేశించారు.

7. వ్యవసాయం లాభసాటిగా మారడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు పెట్టాలనే సిఎం నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తారు.

8. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

9. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టిఎస్ - బిపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టిఎస్ ఐపాస్ లాగానే టిఎస్ బి-పాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది.

10. దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడెం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది.

11. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గతంలో ఉన్న విద్యుత్ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

12. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికి రాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

13. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించినట్లుగానే స్వతంత్ర దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.

14. కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.

Next Story