ఈ దర్శకుడి కెరీర్లో ఎన్ని మలుపులో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 7:55 AM GMT
ఈ దర్శకుడి కెరీర్లో ఎన్ని మలుపులో..

‘క్షణం’ లాంటి క్లాసిక్, బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు రవికాంత్ పేరెపు. ఇంత మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వాడికి అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ అలా జరగలేదు. బహుశా ‘క్షణం’ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ అడివి శేష్‌కు వెళ్లిపోవడం ఇందుకో కారణం కావచ్చేమో. ‘సురేష్ ప్రొడక్షన్స్’లో రవికాంత్‌కు రానా దగ్గుబాటి హీరోగా ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ.. కథతో అందరినీ మెప్పించలేకపోయాడు.

చివరికి సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కథ రాశాడు. ఇది పట్టాలెక్కడంలో, పూర్తి కావడంలో చాలా ఆలస్యం జరిగింది. దీంతో తొలి సినిమా తర్వాత రవికాంత్ కెరీర్లో నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మీద కూడా అంచనాలు పెద్దగా లేని నేపథ్యంలో రవికాంత్ పనైపోయినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ చడీచప్పుడు లేకుండా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రెండుకు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్ యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఇండియాలో ఓటీటీల్లో నేరుగా రిలీజైన సినిమాల్లో ఫస్ట్ హిట్ ఇదే కావడం విశేషం. ఈ ప్రచారంతో జనాలు బాగానే చూస్తున్నారీ సినిమాను. మొత్తానికి రవికాంత్ ఒరిజినల్ టాలెంట్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఇక అతడి కెరీర్ ఊపందుకున్నట్లే.

విశేషం ఏంటంటే.. ఇక్కడ తన సొంత సినిమాతో హిట్టు కొట్టి.. మరో ఓటీటీ హిట్‌లో ఇంకో రకంగా భాగమయ్యాడు రవికాంత్. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లాగే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మరో ఓటీటీ మూవీ ‘భానుమతి అండ్ రామకృష్ణ’లో అతను భాగం కావడం విశేషం. ఈ చిత్రానికి రవికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అంతే కాదు.. సినిమాలో ఒక చోట హీరోయిన్‌తో డేట్‌కు వెళ్లే మోడర్న్ కుర్రాడి పాత్రలో మెరిశాడు. తొలి సినిమా సక్సెస్ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఒక్కసారిగా బహుముఖ పాత్రలతో వార్తలతో చర్చనీయాంశంగా మారాడు.

Next Story