ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ షాక్..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2020 5:11 PM ISTఏపీ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే సరుకుల ధరల్ని పెంచింది. దీంతో తెల్ల రేషన్ కార్డుదారులకు ఇకపై పెరిగిన ధరలకే సరుకులు అందుబాటులో ఉంటాయి. అంతకుముందు రూ.40 ఉన్న కందిపప్పు ధర రూ.67, అర కేజీ పంచదార ధర రూ.10 నుంచి రూ.17లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మాత్రం.. పంచదార ధర పాత ధరలోనే లభిస్తుంది.
లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారు. ఈ నేఫథ్యంలో ధరలను పెంచడం అనేది పేదలకు ఆర్థిక భారమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి క్లిష్ట తరుణంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇదిలావుంటే ఒకప్పుడు ప్రభుత్వాలు.. గోధుములు, బియ్యం, వంట నూనె, కందిపప్పు, పంచదార, కిరోసిన్, శనగపప్పు ఇలా దాదాపు 9 నుంచి 10 రకాల సరుకులు రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరలకు లభించేవి. కానీ ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇక కరోనా నేఫథ్యంలో కేంద్రం పేదలకు బియ్యం, కందిపప్పు లాంటి రేషన్ సరుకులు అందిస్తోంది.