చిట్టిబాబుగా లారెన్స్ ఫిక్సా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2020 2:12 PM ISTరాఘవ లారెన్స్ మాస్ ప్రేక్షకుల్ని ఎంతగా అయినా ఆకట్టుకోనీ.. అతను హీరోగా నటించిన కొన్ని సినిమాలు బాగా ఆడి ఉండనీ.. అతడి ‘అతి’ నటనను భరించడం అందరి వల్లా కాదు. మాస్‌ను ఆకట్టుకునే ఉద్దేశంతో అతను చేసే విన్యాసాలు తట్టుకోవడం కష్టమే. సన్నివేశం ఎలాంటిదైనా దానికి తనదైన ‘అతి’ని జోడిస్తాడు లారెన్స్. పాత్ర స్వభావం, దాని ఔచిత్యంతో అతడికి సంబంధం ఉండదు.
ఐతే తనకు సెట్టయ్యే హార్రర్ కామెడీ సినిమాల్లో అతను ఎంత చేసినా ఓకే అనుకోవచ్చు. కానీ సటిల్ పెర్ఫామెన్స్‌తో పండించాల్సిన పాత్రల్లో మాత్రం లారెన్స్‌ను ఊహించుకోలేం. ముఖ్యంగా రామ్ చరణ్ పట్ల జనాల దృక్పథాన్నే మార్చేసిన ‘రంగస్థలం’లోని చిట్టిబాబు పాత్రలో లారెన్స్ లాంటి నటుడిని ఊహించుకోవడం కూడా కష్టమే.
ఇంతకుముందు ‘రంగస్థలం’ రీమేక్‌లో లారెన్స్ నటించబోతున్నట్లు వార్తలు బయటికి రాగానే ఆ సినిమాను అమితంగా ఇష్టపడ్డ వాళ్లందరికీ చాలా కష్టంగా అనిపించింది. ఐతే తర్వాత దాని గురించి ఏ అప్ డేట్ లేకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టు ఓకే అయిందంటూ తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. చిట్టిబాబు పాత్రకు లారెన్సే ఫిక్సయ్యాడని.. సమంత క్యారెక్టర్లో నిక్కీ గర్లాని నటించనుందని.. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.
కావాలంటే ‘రంగస్థలం’ను డబ్ చేసి తమిళంలో రిలీజ్ చేసుకోవచ్చు. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సాగే సినిమా అనువాదం ద్వారా ఆకట్టుకునే అవకాశముంది. ఇలాంటి క్లాసిక్‌ను, అందులోనూ లారెన్స్ హీరోగా రీమేక్ చేయడం అంటే.. ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.