రామ మందిరం ట్రస్ట్ హెడ్ కు కరోనా పాజిటివ్.. అయోధ్యలో మోదీతో కలిసి స్టేజీ పంచుకున్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 1:22 PM IST
రామ మందిరం ట్రస్ట్ హెడ్ కు కరోనా పాజిటివ్.. అయోధ్యలో మోదీతో కలిసి స్టేజీ పంచుకున్నారు

ఇటీవలే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఆయనతో కలిసి స్టేజీ మీద ఉన్న రామ జన్మభూమి ట్రస్ట్ హెడ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా సోకినట్లు తెలిసింది.

అట్టహాసంగా జరిగిన భూమి పూజ కార్యక్రమంలో స్టేజీ మీద అతి తక్కువ మందిని ఆహ్వానించారు. మహంత్ నృత్య గోపాల్ దాస్ కూడా స్టేజీ మీద ఉన్నారు.. ఆయనతో పాటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఛీఫ్ మోహన్ భగవత్ కూడా స్టేజీ మీద ఉన్నారు. ఆగష్టు 5న అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రామ జన్మభూమి ట్రస్ట్ హెడ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా సోకినట్లు ధృవీకరించడంతో ఆయనతో పాటూ స్టేజీ పంచుకున్న వాళ్ళకు కరోనా సోకిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ కార్యక్రమం నిర్వహించే ముందు అయోధ్యలో పెద్ద ఎత్తున టెస్టులను చేశారు. పూజారి ప్రదీప్ దాస్, 14 మంది పోలీసులకు కూడా కరోనా సోకడం హాట్ టాపిక్ గా నిలవడంతో.. మోదీ వచ్చే సమయానికి మరిన్ని పటిష్ట ఏర్పాట్లు చేశారు. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మోదీతో పాటూ వేదిక మీద ఉన్న ఆయనకు కరోనా వచ్చిందని తేలడం హాట్ టాపిక్ అయింది.

కార్యక్రమంలో పాల్గొన్న మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆగష్టు 5 చారిత్రాత్మక దినమని చెప్పారు. వందల ఏళ్ల నిరీక్షణ ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని.. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని చెప్పారు. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పారు.

ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని అన్నారు. బుద్ధుడి బోధనల్లో, గాంధీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని చెప్పారు. కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్ఫూర్తి అని అన్నారు. మనం ఎలా బతకాలనే విషయాన్ని రాముడి జీవితం మనకు బోధిస్తుందని చెప్పారు. అయోధ్య భూమిపూజలో పాలుపంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు.

Next Story