అయోధ్య రామమందిరం భూమిపూజకు పలు ప్రాంతాల నుండి మట్టి, నీరు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 12:11 PM ISTఅయోధ్య రామమందిరం భూమిపూజకు పలు ప్రాంతాల నుండి మట్టి, నీరు తరలి వెళ్తున్నాయి. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మకమైన ప్రాంతాల నుండి మట్టి, నీరు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. 'హల్దీఘంటి'.. చంద్రశేఖర్ ఆజాద్ అమరుడైన ప్రాంతం నుండి కూడా మట్టిని తీసుకుని వెళ్లారు. అయోధ్య నగరం అద్భుతమైన ఘట్టానికి ఎంతో అద్భుతంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రతి గోడపైనా రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు. ప్రధాన వీధుల్లోని భవనాలకు పసుపు రంగు వేయడంతో వీధులన్నీ శోభాయమానంగా తయారయ్యాయి. కన్నులపండువగా జరగనున్న ఈ చారిత్రక కార్యక్రమానికి ఏర్పాట్లు భారీఎత్తున సాగుతున్నాయి. కాషాయం-పసుపు రంగుల్లో అయోధ్య ముస్తాబవుతోంది.
1500 కు పైగా చారిత్రాత్మక ప్రాంతాలు, నదుల నుండి నీటిని, 2000కు పైగా పుణ్యక్షేత్రాల నుండి మట్టిని అయోధ్యకు తీసుకుని వచ్చారని వి.హెచ్.పి. సంపర్క్ ప్రముఖ్ అశోక్ తివారి తెలిపారు. పలువురు భక్తులు కూడా రామ మందిరం కోసం మట్టిని తీసుకుని వచ్చారు.
ఇద్దరు సోదరులు రాధే శ్యామ్ పాండే, షాబ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫాల తమ రామభక్తిని చాటుకున్నారు. వీరు 1968 నుంచి శ్రీలంకలోని పదహారు ప్రదేశాలు, ఎనిమిది నదులు, మూడు సముద్రాల ద్వారా రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించారు. 151 నదులు, అందులో 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుండి రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించామని అన్నారు. శ్రీలంకలోని 16 చోట్ల నుంచి మట్టిని కూడా సేకరించామని.. కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నట్లు ఆ సోదరులు తెలిపారు. 1968 నుంచి 2019వరకు వివిధ మార్గాల ద్వారా నీటిని సేకరించామన్నారు.
అమేథీ మున్నా 500 పెద్ద, చిన్న ఆలయాలకు చెందిన మట్టిని సేకరించాడు. రామ భక్తుడైన మొహమ్మద్ ఫైజ్ ఖాన్ దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీరాముడి తల్లి అయిన కౌసల్య జన్మస్థానం నుండి మట్టిని తీసుకుని వచ్చాడు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మకమైన ఘట్టానికి హాజరవుతూ ఉండడంతో అయోధ్య నగరాన్ని అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేకం, వనవాసం, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు, సరియూ నదీ, దేవతా మూర్తుల చిత్రాలతో సిటీ రోడ్లు భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాయి. సాయంకాలం వేళ విద్యుత్ కాంతులతో సరయూ నది వెలిగిపోతోంది. ఈ నెల 5న జరగనున్న ఆలయ భూమి పూజకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. కాషాయ రంగు జెండాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.
అయోధ్యలో కొలువుదీరనున్న రాముని కోసం ప్రత్యేక వస్త్రాలు కూడా సిద్ధమయ్యాయి. రామ్‌లల్లా ఆలయ ప్రధాన అర్చకులైన మహంత్ సత్యేంద్రదాస్ కు ఈ ప్రత్యేక వస్త్రాల్నిరామ్ దళ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కల్కిరామ్ అందించారు.
రామ మందిరం భూమిపూజలో పాల్గొనడానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్గమధ్యంలోని ప్రఖ్యాత హనుమాన్ గధీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని, ఆ సమయంలోనే ప్రధాని ఆరోగ్యం, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు చదువుతామని హనుమాన్ గధీ ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ మీడియాకు తెలిపారు.
ఆగస్టు 5న జరుగనున్న భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ కోసం అద్వానీ, మురళి మనోహర్ జోషిలు నేరుగా అయోధ్య వెళ్లబోవడం లేదని, ఆ ఇద్దరు నేతలూ వీడియో లింక్ ద్వారానే పూజలో పాల్గొంటారని తెలుస్తోంది.