ముందుగా సెలెక్ట్ చేసిన విఐపీ లను మాత్రమే వేదిక మీదకు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 7:13 AM GMT
ముందుగా సెలెక్ట్ చేసిన విఐపీ లను మాత్రమే వేదిక మీదకు..!

శ్రీరాముడు జన్మస్థానంగా భావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబువుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొందరు అతిథిలు పాల్గొననున్నారు.

కేవలం సెలెక్ట్ చేసిన విఐపీ లను మాత్రమే స్టేజ్ మీదకు అనుమతించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వేదిక మీదే ఉండనున్న నేపథ్యంలో.. స్టేజి మీదకు పంపే ముఖ్యమైన వ్యక్తుల విషయంలో కూడా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోదీ, ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, యూపీ సిఎం ఆదిత్యనాథ్, రామ్ మందిర్ ట్రస్ట్ హెడ్ నృత్య గోపాల్ దాస్ లు స్టేజ్ మీద ఉండనున్నారు. రామ మందిరం జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ఎవరు ఎప్పుడు మాట్లాడాలో ఆయన నిర్ణయించనున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:30 నుండి 12:40 వరకు అభిజీత్ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

చాలా తక్కువ మంది విఐపీలు మాత్రమే స్టేజీ మీద ఉండనున్నారు. వారి మధ్య కూడా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. కోవిద్-19 ప్రోటోకాల్స్ అమలులో ఉండనున్నాయి. అయోధ్యలో పెరుగుతున్న కరోనా కేసులు కూడా అధికారులను కలవరపెడుతున్నాయి. గత 24 గంటల్లోనే 142 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1194 కు చేరింది. యాక్టివ్ లో 544 కేసులు ఉన్నాయి. దీంతో అయోధ్యలో టెస్టింగ్ లను ఎక్కువ చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ రామ జన్మభూమి భూమి పూజకు వెళ్లడానికంటే ముందే హనుమాన్ గర్హి ఆలయానికి వెళ్లనున్నారు. 2016లో రాహుల్ గాంధీ, 2019లో ప్రియాంక గాంధీ ఈ ఆలయాన్ని సందర్శించారు. రామ జన్మభూమి భూమి పూజకు హాజరవ్వాలని ప్రముఖ పీఠాధిపతులను కూడా ట్రస్ట్ సభ్యులు ఆహ్వానిస్తూ వస్తున్నారు. రామజన్మభూమి కోసం పోరాటం చేసిన ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, ఉమా భారతి, సాధ్వి రితంబరలు హాజరుకానున్నారు.

రామ జన్మభూమి భూమిపూజ మహోత్సవాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు. న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య రామమందిరం త్రీడీ చిత్రాలను ప్రపంచంలోనే అతిపెద్ద 17వేల చదరపుటడుగుల భారీ నాస్‌డాక్‌ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు.

Next Story
Share it