రాజ్యసభకు ఈసారికి ఆ కళ బాగా తగ్గిపోయిందట

By సుభాష్  Published on  20 Jun 2020 12:46 PM IST
రాజ్యసభకు ఈసారికి ఆ కళ బాగా తగ్గిపోయిందట

అందరికి కాదు కానీ కొందరికి లోక్ సభ.. రాజ్యసభ అన్నంతనే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇద్దరిని ఎంపీలే అంటారు? మరి తేడా ఏమిటి? అని ప్రశ్నించేవారు లేకపోలేదు. రాష్ట్రాల్లో ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ అన్న తేడా ఉన్నప్పుడు పార్లమెంటులో ఉన్న లోక్ సభకు.. రాజ్యసభకు సభ్యుల్ని ఎంపీ అని ఎందుకు పిలవాలన్న సందేహం కొందరికి వస్తుంటుంది. లోక్ సభ ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగితే.. రాజ్యసభ ఎన్నికలు ఒక క్రమపద్దతిలో సభ్యుల పదవీ కాలం ముగిసినంతనే జరుగుతూ ఉంటుంది. ఈ విషయాల్ని పక్కన పెడితే.. తాజాగా పది రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ నిన్న (శుక్రవారం) రాత్రికి ముగిశాయి.

వాస్తవానికి 20 రాష్ట్రాల్లో మొత్తం 61 ఖాళీలకు 42 మంది ఏకగ్రీవంగా ఎన్నికైతే.. పది రాష్ట్రాల్లో పందొమ్మిది స్థానాలకు మాత్రం పోలింగ్ ద్వారా ఎన్నికయ్యారు. గతంతో పోలిస్తే.. ఈసారి పెద్దల సభలో అనుభవం ఉన్న వారి సంఖ్య తగ్గిపోవటం ఒకరకంగా ఇబ్బందన్న మాట వినిపిస్తోంది. తాజాగా సభకు ఎన్నికైన 61 మందిలో 43 మంది సభకు కొత్తవారు కావటంతో.. సభ అనుభవం తగ్గినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. పోటీ జరిగిన 19 స్థానాల్లో ఎన్నికైన పదిహేను మంది కూడా పెద్దల సభకు తొలిసారి ఎన్నికైనవారే కావటం గమనార్హం. మొత్తం 61 మందిలో 12 మంది మాత్రమే సిట్టింగ్ సభ్యులు ఉన్నారు. అనుభవంతో పెద్దల సభలో ఉండే కళ.. తాజాగా ఎన్నికైన వారితో మాత్రం కాస్త తగ్గినట్లేనని చెప్పక తప్పదు.

Next Story