రాజస్థాన్ ఉత్కంఠ‌.. ఎవరి ఆట వారిదే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 4:59 PM IST
రాజస్థాన్ ఉత్కంఠ‌.. ఎవరి ఆట వారిదే..

గడిచిన కొద్ది రోజులుగా రాజస్థాన్ రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ ఆట ఒక కొలిక్కి రాలేదు. తీవ్రమైన ఉత్కంటతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్పీకర్ ఇచ్చిన నోటీసుపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలెట్ కు ఇచ్చిన గడువు పూర్తి కావొస్తున్న పరిస్థితి మరోవైపు.. సచిన్ వేసిన పిటిషన్ పై రాజస్థాన్ హైకోర్టు లో విచారణ జరుగుతోంది.ఈ రోజు విచారణను పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి ప్రకటించటం తెలిసిందే.

దీంతో.. కోర్టు నిర్ణయం ఇప్పుడు రాజస్థాన్ రాజకీయాల్ని ప్రభావితం చేయనుంది. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలతో చాలానే మార్పులు చోటు చేసుకునే వీలుంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా క్యాంపుల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వంద మంది వరకు ఉన్న ఎమ్మెల్యే గడిచిన వారం రోజులుగా జైపూర్ లోని ఫెయిర్ మోంట్ హోటల్ లో మకాం వేశారు.

ఇక్కడే తన శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్. వారం వ్యవధిలో ఆయన సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించటం ఇది మూడోసారి కావటం గమనార్హం. వాస్తవానికి ఈ రోజు సచిన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు గెహ్లాత్ క్యాంప్ కు వస్తారని అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అనూహ్యంగా సోమవారం సాయంత్రం సచిన్ పైలెట్ మీద వ్యక్తిగత దూషణలకు దిగటంతో వారు మనసు మార్చుకున్నారని.. పైలెట్ వర్గంలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సచిన్ పైలెట్ వర్గం సైతం హైకోర్టు తీర్పు మీదే ఆశలు పెట్టుకుంది. మొత్తంగా రాజస్థాన్ రాజకీయాన్ని రాష్ట్ర హైకోర్టు తన ఆదేశాలతో తీవ్రంగా ప్రభావితం చేయనుందని చెప్పక తప్పదు.

Next Story