ముదురుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం
By సుభాష్ Published on 12 July 2020 5:28 PM ISTరాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య రాద్దాంతం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహాట్ వర్గం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులపై కేబినెట్ మంత్రులతో సీఎం ఆదివారం సమావేశం నిర్వహించి చర్చించారు.
ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఆదివారం రాత్రి 9 గంటలకు సీఎం అశోక్ జైపూర్‌లో సమావేశం కానున్నారు. అటు సచిన్ పైలట్ మద్దతుదారులైన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. రాజస్థాన్ కాంగ్రెస్ సారథ్యం బాధ్యతల నుంచి సచిన్ పైలట్ తప్పించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రస్తుతం సంక్షోభానికి కారణమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ కుట్రలు
కాగా, తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం ఆరోపించారు. బీజేపీ నేతలు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆయన చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. బీజేపీపై చేసిన ఆరోపణలు సీఎం అశోక్ నిరూపించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేసింది. సొంత గూటిలోనే నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను సరి చేసుకోలేక తమపై లేనిపోని నిందలు వేయడం సరికాదని బీజేపీ నేతలు హితవు పలికారు. ఈ సంక్షోభం ఇప్పటిది కాదని, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఈ కుమ్ములాటలు జరుగుతున్నాయని అన్నారు.
కాగా, గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంపై తనకు కూడా ఎస్‌ఓజీ నోటీసు జారీ చేయడం పై సచిన్ పైలట్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం అశోక్.. కాంగ్రెస్ వైపు వాదన చెప్పేందుకు తనతోపాటు డిప్యూటీ సీఎం, చీఫ్ విప్‌కు ఎస్‌ఓజీ నోటీసులు జారీ చేసిందన్నారు. దీనిని వక్రీకరిస్తూ ఓ వర్గం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.