బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకి 15 కోట్లు ఆఫర్ చేస్తోంది : అశోక్ గెహ్లాట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 10:55 AM GMT
బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకి 15 కోట్లు ఆఫర్ చేస్తోంది : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తోందని ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి ప్రయత్నాలు చేస్తోందని శనివారం నాడు ఆరోపణలు గుప్పించారు. ఓ వైపు దేశం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎలా కూలదోయాలా అని ఆలోచిస్తోందని అన్నారు. అపోజిషన్ లో బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు 15కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిందని అశోక్ గెహ్లాట్ తెలిపారు.

కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే.. మరో వైపు బీజేపీ సమస్యలను సృష్టిస్తోందని అన్నారు. రాజస్థాన్ లో బీజేపీ అన్ని లిమిట్స్ ను దాటేసిందని.. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు అశోక్ గెహ్లాట్.

కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభాలపై కూడా ఆయన మాట్లాడారు. పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు 15కోట్లు ఇస్తామంటూ గత కొద్దిరోజులుగా మాటలను వింటూనే ఉన్నామని.. ఇది తరచూ జరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి బీజేపీ ఇదే బాటలోనే ప్రయాణిస్తోందని.. ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. గోవా, మధ్య ప్రదేశ్, నార్త్-ఈస్ట్రన్ రాష్ట్రాల్లో అధికారంలో మార్పులు జరిగాయని.. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకుంటోందని ఆయన ఆరోపించారు. రాజస్థాన్ లో కూడా అలాంటి ప్లాన్ అమలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని.. దాన్ని ఆపి బుద్ధి చెప్పామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ ఇంకా స్పందించలేదు.

200 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ 107 సీట్లు గెలుచుకోగా, 12 మంది ఇండిపెండెంట్లు అశోక్ గెహ్లాట్ కు అండగా ఉన్నారు. ఇతర పార్టీలైన రాష్ట్రీయ లోక్ దళ్, సిపిఐ(ఎం), భారతీయ ట్రైబల్ పార్టీలకు చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు కూడా అశోక్ గెహ్లాట్ ప్రభత్వానికి మద్దతు ఇచ్చారు.

Next Story