15 మందికి కరోనా అంటించారని రూ.6లక్షల జరిమానా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 8:46 AM IST
15 మందికి కరోనా అంటించారని రూ.6లక్షల జరిమానా

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగత దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికి కొందరు పెడచెవిన పెడుతున్నారు. వివాహాలు, శుభకార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీనికి పరిష్కారంగా ఓ కలెక్టర్‌ వినూత్నంగా ఆలోచించాడు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా రావడానికి కారణమైన ఓ కుటుంబానికి రూ.6లక్షల జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్‌ రాఠీ ఈ నెల 13న తన కొడుక్కి వివాహాం జరిపించాడు. భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పెళ్లికి కేవలం 50 మంది అతిథులకే అనుమతి ఉంది. ఈ నిబంధనను అతిక్రమించింది ఆ కుటుంబం. వివాహానికి హాజరైన వారిలో 15 మందికి కరోనా సోకింది. వీరిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన గీసులాల్‌ రాఠీపై ఈ నెల 22న పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. కరోనా సోకిన 15 మందిని ప్రభుత్వం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించింది. వీరికి కరోనా పరీక్షలు చేయడం, ఆహారం, చికిత్స, అంబులెన్స్‌కు మొత్తం కలిపి రూ.6,26,600 ఖర్చు అయింది. నిర్లక్ష్యం వహించి 15 మందికి కరోనా రావడానికి కారణమైన వ్యక్తి నుంచే ఈ మొత్తం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర భట్‌ అధికారులను ఆదేశించారు. జరిమానా విధించిన డబ్బును వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు డిపాజిట్ చేయాలని చెప్పారు.

Next Story