జులై 31 వరకు పాఠశాలలు మూత: డిప్యూటీ సీఎం

By సుభాష్  Published on  27 Jun 2020 5:25 AM GMT
జులై 31 వరకు పాఠశాలలు మూత: డిప్యూటీ సీఎం

కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులకు శాపంగా మారింది. ఈ వైరస్‌ వల్ల సామాన్యుల నుంచి విద్యార్థులు, వ్యాపారస్థులు, ప్రతి ఒక్కరిపై ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం గడిచిపోతున్నా..కరోనా వల్ల పాఠశాలలు తెరుచుకునే అవకాశం లేకుపోవడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ సంవత్సరం చదువులు అంతంత మాత్రంగానే ఉండటంతో వారిలో టెన్షన్‌ మొదలైంది. కరోనా ఎప్పుడు తగ్గిపోతుందా.. పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయా.. అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వణికిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 31 వరకు పాఠశాలలన్నీ మూసే ఉంటాయని డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే కరోనా కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా సిలబస్‌ను 50 శాతం తగ్గించాలని సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లోనే తరగతులు

ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఆన్‌లైన్‌ తరగతులు, కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. వారానికి ఒకటి, లేదా రెండు సార్లు 9,10 తరగతి విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా విభజించి తరగతులను నిర్వహించేలా చూడాలని కొందరు అధికారులు డిప్యూటీ సీఎంకు సూచించగా, టెన్త్‌ విద్యార్థుల వరకూ తరగతులు నిర్వహించడం మంచిదని మరి కొందరు సూచించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దేశంలో కరోనాలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో ఇప్పట్లో పాఠశాలలు తెరుచుకోవడం కష్టమనే చెప్పాలి.

Next Story