భయపెట్టేలా రాహుల్ తాజా హెచ్చరిక..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 July 2020 2:20 PM IST
భయపెట్టేలా రాహుల్ తాజా హెచ్చరిక..!

కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరిని ఎంత వదిలించుకుందామనుకున్నా దురదృష్టం వెంటాడుతుంది. కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ గాంధీ రెండో కోవలోకి వస్తారు. ఆయన ఎంత ప్రయత్నించినా.. తన ఇమేజ్ ను పెంచుకోవటంలో విఫలవుతున్నారు. పలు సందర్బాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. చేస్తున్న విశ్లేషణలు సరైన ఆదరణ లభించటం లేదు. దీనికి తోడు రాహుల్ చెప్పే మాటలకు అధికారపక్షం నుంచి వచ్చే కౌంటర్లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అదే సమయంలో రాహుల్ మాటలకు ఎలాంటి మైలేజీ రాని పరిస్థితి. దీంతో.. ఆయనెంత ప్రయత్నిస్తున్నా తన వాదనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు.

తాజాగా పెరుగుతున్న కరోనా కేసులపై రాహుల్ గళం విప్పారు. నమోదవుతున్న పాజిటివ్ లు ఎక్కువ కావటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఆగస్టు 10 నాటికి 20 లక్షల పాజిటివ్ కేసులు దాటే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గురువారం నాటికి 9.68 లక్షల పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఇవాల్టితో పది లక్షల కేసులకు చేరనుంది. దేశంలో మొదటి పాజిటివ్ కేసు నమోదైన మూడున్నర నెలలకు 10లక్షల కేసులు నమోదైతే.. రానున్న మూడు వారాల్లోనే మరో 10లక్షల కేసులు నమోదు కానుందన్న హెచ్చరికలు చేశారు.

రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. ఇప్పుడున్న వేగంతో కరోనా వ్యాప్తి కొనసాగితే భారీ ఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉందని రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై మోడీ సర్కారు స్పందించాల్సిన అవసరం ఉంది.

దేశంలో కేసుల సంఖ్య పది లక్షల కేసులు దాటుతాయని గతంలో తాను చేసిన వ్యాఖ్యను రాహుల్ ట్వీట్ చేయటంతో పాటు.. సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ చేసిన వ్యాఖ్యలతో కూడిన కథనాన్ని రాహుల్ ట్యాగ్ చేయటం గమనార్హం.

Next Story