దేశంలో 10లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 6:03 AM GMT
దేశంలో 10లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10లక్షలు దాటింది. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 34,956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 687 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,03,832కి చేరింది. 6,35,757 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 3,42,473 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 63 శాతంగా ఉంది. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,30,72,718 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,228 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 2.76లక్షల కేసులు నమోదు కాగా.. 10,928 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 1.52లక్షల కేసులు నమోదు కాగా.. 2,167 మంది మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో 1.19లక్షలు నమోదు కాగా.. 3,545 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 36.9లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. 20లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది.

Next Story