రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2020 11:30 AM GMTలక్నో : యూపీలోని హత్రస్‌లో చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రస్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలను గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్, ప్రియాంకల కాన్వాయ్ యమునా హైవే ఎక్స్‌ప్రెస్ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు.
వారిని అనుసరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా నడక ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకానొక దశలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో రాహుల్ కిందపడ్డారు. రోడ్డుపై కేవలం ప్రధాని నరేంద్ర మోదీయే నడవాలా? సామాన్యులకు నడిచే హక్కులేదా?'' అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు తనను తోసేసి, లాఠిఛార్జ్ కూడా చేశారని ఆయన ఆరోపించారు. తనను పోలీసులు తోసేస్తే కింద పడ్డాని అన్నారు. తాను ఏరకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్టు చేశారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. యూపీలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.