వార ఫలాలు 20-9-2020 ఆదివారం నుండి 26-9-2020 శనివారం వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2020 5:07 AM GMT
వార ఫలాలు 20-9-2020 ఆదివారం నుండి 26-9-2020 శనివారం వరకు

మేష రాశి :- ఈ రాశి వారికి శత్రు నాశనము విశేష ధనలాభము సౌఖ్యము ఇవి ఆనందపరచి ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కానీ చంద్రుని స్థితి మృత్యు భయాన్ని కలిగిస్తోంది. అందుచే మంగళ బుధ వారాల్లో మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. లగ్నంలో ఉన్న కుజుడు విచారాన్ని ఇస్తున్నాడు. బుధ గురు శుక్రులు మాత్రము అలంకార ప్రాప్తి ధనలాభము స్త్రీ సౌఖ్యము కల్పిస్తున్నారు. రాహువు భవిష్యత్తులో అకారణ కలహాలు కారణం అవుతాడు. వీరు గ్రహస్థితి కొంచెం అనుకూలంగాను కొంత కొంత ప్రతికూలత నిండు ఉంది. కొంచెం భయం భయం గాను మానసిక ఆందోళనకు గురి అవుతారు శత్రు వృద్ధి పెరిగింది. సొంత వస్తువులను పోగొట్టుకొనే అవకాశం కూడా ఉంది. ఏ పని చేసిన వీరికి 49 శాతం మాత్రమే శుభ ఫలితాలు కనిపిస్తాయి. అశ్విని నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అయింది జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. భరణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కృత్తిక ఒకటో పాదం వారికి మాత్రం విపత్తార అయింది కాబట్టి జాగ్రత్త వహించండి.

పరిహారం :- నిత్యము నవగ్రహ దర్శనం గాని నవగ్రహ శ్లోకాలు గాని చదవండి. మంగళవారం నియమాలు పాటించండి లేదా హనుమాన్ చాలీసా ని పఠించిన శుభం.

వృషభ రాశి :- ఈ రాశి వారికి ధన లాభం మాత్రమే ఊరటనిస్తూ కనిపిస్తుంది. జీవితంలో వీరికి పరీక్షా కాలం ప్రారంభమైంది. ధనము లేకపోవడం రోగము అకారణ కలము ఇలా ఒకటేమిటి అన్నీ కూడా ఒకేసారి అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆత్మస్థైర్యం మనోధైర్యంతో ముందుకు సాగవలసినటువంటి గడ్డు రోజులు ఏర్పడ్డాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది మీపై అధికారాన్ని ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని అనుకుంటారు. గ్రహాలన్నీ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మీరు ఎన్నడూ చూడనటువంటి కష్టాల్ని నష్టాల్ని ఇవాళ మీరు చూడబోతున్నారు. అయితే దైవానుగ్రహం కొద్ది మీరు కొంత బయటపడే అవకాశం లేకపోలేదు. దైవాన్ని వేడుకున్నట్లయితే గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభింకండి. నిదానంగా పనులు చేయడం ప్రారంభించండి. కొత్త వ్యక్తులను అసలు నమ్మవద్దు. మీకు ఈ వారంలో 21 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టే ప్రతికూల ఫలితాలు. రోహిణి నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. మృగశిర 1 2 పాదాలు వారికి జన్మతార అయింది ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా వహించండి.

పరిహారము : నవగ్రహాల దర్శనము మరియు ప్రతి రోజు నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసి నట్లయితే కొంత వరకు మీకు అనుకూలతలు బాగా ఉంటాయి.

మిధున రాశి :- ఈ రాశివారికి ధనలాభము సౌఖ్యము భూషణము ఇవి కొంత వరకు వీరిని ముందుకు నడిపిస్తాయి. అయితే వీళ్లకు రవి ప్రభావం చేత అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రుడు కార్యాచరణ చేస్తాడు కానీ మానసికంగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. కుజుడు రావలసిన బాకీలు వసూలు చేయడంలో సహకరిస్తాడు. మీకు బుధ గురు శుక్ర లు చాలా విషయాల్లో కుటుంబసౌఖ్యంని శత్రుజయంని ఇచ్చి కావలసినటువంటి నూతన అమరికలను సమకూరుస్తారు. మంగళవారం నుంచి మీకు సుఖమైన జీవితాన్ని కుటుంబం బంధుమిత్రులతో మీరు ఎక్కువగా ఆనందాన్ని పొందగలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఈ వారంలో 49 శాతం ఫలితాలను పొందగలిగిన శుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి బావుంది. పునర్వసు 1 2 3 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి ఇది మంచి అనుకూలతలనిస్తాయి.

పరిహారం :- రాహు కేతువులకు పూజాపునస్కారాలు నిర్వర్తించండి. మినుములు ఉలువలు దానం చేయండి. శనిగ్రహ జపం చేయండి నువ్వుల నూనె దానం చెయ్యండి.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి సంపద లాభము సంతోషము సుఖ జీవితాన్ని ఇస్తాయి. ఆనందంతో ఆరోగ్యంతో మసలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి చంద్ర స్థితిని బట్టి కాస్తంత కార్య హాని అనారోగ్య రోగ సూచనలు ఉన్నాయి. వీరి ఆలోచనలు ఒక కొలిక్కి రాక కార్యాలన్ని కూడా మధ్యస్థంగా ఉండి పోయి ముందు నుయ్యి వెనుక గొయ్యి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఇబ్బంది ఉంది. ఏం చేసినా ఎంత చేసినా ప్రయోజనాలు కనిపించడంలో తక్కువగా ఉండటం వల్ల మీరు నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. మొక్కవోని దీక్షతో వీరు ఉండడంవల్ల ముందుకి సాగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.. కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంతో ముందుకు సాగగలరు. వీరికి ఈ వారంలో 49% శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. పునర్వసు నాలుగో పాదం వారికి మిత్ర తార అయింది కాబట్టి గ్రహాలన్నీ అనుకూలంగా పని చేస్తాయి పుష్యమి నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రమే సాధనం కార్య సాధనం ప్రయత్నం ఉంటే ఫలితాలు పొందగలుగుతారు.

పరిహారం :- శనికి జపం చేయండి రోజు రుద్రుని దర్శనం చేసుకోండి. మంగళవారం నియమాలు హనుమాన్ చాలీసా హనుమ స్తోత్రం గాని పారాయణ చేయండి.

సింహ రాశి :- ఈ రాశి వారికి ధన లాభ ప్రాప్తి ఉత్సాహము విశేష ధన యోగము ముందుకు నడిపిస్తాయి. కానీ అభివృద్ధి పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. రవి లగ్నంలో ఉండటం చేత మీకు భయం ఎక్కువ ఉంటుంది. మిత్రుల వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులకు గురి కావాల్సిన స్థితి. నమ్మిన వారి వల్ల మీకు ధన వ్యయం చాలా ఎక్కువగా అవుతుంది. మీకు జీవితంలో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు చాలా మంది కుటుంబ సభ్యులతో సహా అందరూ మీకు అగౌరవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధ గురు శుక్ర ఫలితాల వల్ల మీరు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.గౌరవం కోసం మీరు కొంత ధనాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి. అధికారుల ప్రాపకం కోసం మీ వృత్తిలో మీరు నిమ్నోన్నత పొందుతూ జీవించవలసి వస్తుంది. మీకు ఈ వారంలో 49% శుభ ఫలితాలు ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అయింది అననుకూలత ఎక్కువగా ఉంది. పుబ్బ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి చాలా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి విపత్తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

పరిహారం:- సూర్య నమస్కారాలు చేయండి యోగ సాధన చేయండి మెడిటేషన్ వల్ల, పెరుగు గోధుమలు దానం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

కన్యా రాశి :- ఈ రాశి వారికి ధన లాభం మాత్రమే ముందుకు నడిపిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో కూడా కలిసి మెలిసి జీవించడం ఒత్తిడిని తగ్గించుకోవడం చాలావరకు మంచిది. వీరికి ఈ వారంలో ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. నోటిని శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకుంటూ మీరు వ్యవహరించాల్సిన పరిస్థితి . కళత్ర స్థానాలతో అయిన శుక్రుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థితిలోనే ఉన్నాయి. కాబట్టి మీకు చిరాకు నిరాశ నిస్పృహ కలిగి ఇవన్నీ మిమ్మల్ని కుంగదీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధిగమించాలంటే యోగ సాధన చేస్తూ ఏవైనా శారీరక మైన శ్రమ కలిగించే పనులు చేసుకుంటూ మీరు మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు ఈ వారంలో 14 శాతం మాత్రమే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది. చిత్త 1 2 పాదాలు వారికి జన్మ ద్వారా అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారము :- గురు నామస్మరణ దైవాన్ని మరిచిపోకుండా ఉండడమే పరిహారము. నవగ్రహ స్తోత్ర పారాయణ నవగ్రహములకు దానము నవగ్రహ శాంతి చేసుకున్నా చాలా మంచిది.

తులా రాశి :- ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యమును ధనలాభము సంతోషము సర్వసంపదలు సమకూరి హాయిగా ఆనందంగా ఉండాలని ప్రయత్నం ఉంటుంది. కానీ ఈ గ్రహస్థితి అనుకూలత చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఈ రాశివారు నిమిష నిమిషానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతిపనిలోను వీరికి ఆటంకాలు కనిపిస్తూ కుజుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు. బుధ గురు గ్రహాల అనుకూలత కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి శుక్రుడే అనుకూలంగా ఉండటం చేత మీరు స్వయంప్రతిపత్తి ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. శనిగ్రహ ప్రభావం చేత మీకు రోగం తిరగబెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరైనా ముసలివారు ఉన్నట్లయితే దీర్ఘ రోగాలు ఉన్నాసరే వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఎవరితో విరోధించినా ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి అవి శాశ్వత శత్రుత్వాలు గా మారిపోయే అవకాశం ఉంది. జరగాల్సిన పనులు ఏవైనా ఉంటే అందులో కొన్ని జరిగి మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వారంలో మీకు 28 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్వాతి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది అనుకూలంగా ఉంది. విశాఖ 1 2 3 పాదాలు వారికి మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలను ఈ వారంలో పొందగలుగుతారు.

పరిహారము :- బుధవారం పెసలు గురువారం సెనగలు నానబెట్టి బెల్లం వేసి ఆవుకి తినిపించండి. గురు స్తోత్ర పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రము శుభప్రదం.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యమును ధనమును ఆనందము దాన్ని వృద్ధి ఇవన్నీ కూడా ఉక్కిరిబిక్కిరి చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి మీ మీద మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. కానీ ప్రతి సారి మిమ్మల్ని మీరు ప్రతి పనిలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర మీరు తగ్గి ఉండవలసిన అవసరం కొన్నాళ్ల వరకూ ఉంటుంది. మీకు కొంచెం ఆటంకాలు ఎదురైనా మానసిక ఆందోళన పొందుతూ ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉన్నా దేనికి మీరు వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఆదాయం కూడా ఈ వారంలో మీకు ఉంటుంది. మీకు ఈ వారంలో 56 శాతం శుభఫలితాలు ఉన్నాయి. అన్ని రాశుల కంటే మీ రాశికి ఎక్కువ ఫలితాలు ఈ వారం లో ఉండడం విశేషం. ఈ పరంపర ఇంచుమించుగా కొనసాగవచ్చు. మీకు పట్టిన ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పోయింది. విశాఖ 4వ పాదం వారికి మిత్రులారా ఇది చాలా అనుకూలంగా ఉంది అనురాధ నక్షత్ర జాతకులకు అయింది కాబట్టి ప్రతికూలత ఎక్కువగా ఉంది. జ్యేష్ట నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు చాలా ఎక్కువ.

పరిహారము :- రాహు కేతువులకు జపాలు చేయించండి. మినుములు ఉలవలు దానం చేయండి. రోజు రుద్రాభిషేకం మంచి ఫలితాలను ఇస్తుంది.

ధను రాశి :- ఈ రాశి వారికి లాభము సంతోషము చాలా ఆనందాన్ని ఈ వారంలో కలిగిస్తాయి. బుధ శుక్రులు అనుకూలం తో మీకు ఈ వారంలో ఆనందం కొంచెం ఎక్కువగానే కలుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. కుజుడు శత్రు మూలకంగా భయాన్ని కలిగించి మిమ్మల్ని ఆందోళన పెడతాడు. గురుడు స్థానచలన మును సూచిస్తూ ఉన్నాడు. మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాలలో కొంత నష్టం జరగవచ్చు. తద్వారా స్థానాన్ని మార్చవలసిన పరిస్థితి కనిపిస్తుంది. బద్ద శత్రువు కూడా ఉండటం చేత జాగ్రత్తగా మీరు ఉండడం అవసరం. ఇంతకు ముందున్న భయాందోళనలు మాత్రం మీకు మీరుగా పోగొట్టగలిగే శక్తిని మీలో వస్తుంది. రావలసిన బాకీలు వసూలు కావడం భూసంబంధమైన వ్యవహారములు విద్యా సంబంధ వ్యవహారములు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. అనుకున్నదానికంటే ఖర్చులు మాత్రం ఎక్కువ. మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. మూల నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అయింది కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి విపత్తార అయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- గురునకు జపం చేయించండి. బుధవారం నాడు రాత్రి నానబెట్టిన సెనగలు మరుసటి రోజు ఉదయం బెల్లం వేసి ఆవుకు తినిపించండి. గురు స్తోత్ర పారాయణ చేయండి.

మకర రాశి :- ఈ రాశివారికి శారీరకసౌఖ్యము లాభము కుటుంబ సౌఖ్యమును ఇవి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రవి ప్రభావం మీరు ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. మీ కుటుంబంలో ఎవరైనా దీర్ఘవ్యాధులు ఉన్నట్లయితే వారి ఆరోగ్యం లో మీకు వ్యయ ప్రయాసలు తప్పవు. దీనికి తోడు శని ప్రభావం కూడా మీపై పని చేయటం చేత ఆరోగ్యవిషయాలు కుటుంబంలో అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. బుధ గురు శుక్ర శని ప్రభావం చేత కుటుంబానికి అధికారికంగా రాజకీయంగా అన్ని రకాలుగానూ నష్టం సంభవిస్తుంది . ప్రతి పనిలో మీరు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. మీకు అసలే ఆవేశం ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉంది కనుక మీరు అలాగేముందుకు సాగినట్లు అయితే ప్రతి పనిలోనూ మీకంటే ముందే దృష్టశక్తులు పనిచేసి మీరు ఏ పని చేయలేని అసమర్థులుగా నిరూపిస్తాయి. మీరు శక్తికి మించి పరిగెట్ట కండి. ఏం చేసినా మీకు ఆ ఫలితాలు దక్కవు. జన్మశని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగ భయం కూడా సూచిస్తోంది. మీకు ఈ వారంలో 35 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ఇబ్బందిగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి ఆర్థికంగా బావుంటుంది. ధనిష్ట 1 2 పాదాలు వారికి జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారము :- శని ప్రభావం ఎక్కువగా ఉండటం చేత శనికి జపం చేయించండి దానధర్మాలు కూడా చేయండి. బ్రాహ్మణులకు భోజనం పెట్టించండి లేదా వారికి నిత్యావసర సరుకుల దానం దేవాలయంలో గానీ మీ ఇంటి వద్ద గానీ చేయండి.

కుంభ రాశి :- ఈ రాశి వారు ధన లాభం పొంది సుఖసౌఖ్యాలతో జీవించే అవకాశం ఉంది. రవి ప్రభావం చేత అనారోగ్యం కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. శనిగ్రహ ప్రభావం మీకు ధన వ్యయాన్ని స్థానచలనం ఈ రెండింటిని సూచిస్తున్నాడు. శుక్రుడు అపకీర్తి పాలు చేస్తాడు. వీటన్నిటికీ కారణం గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉండడమే. బుధుడు ఎంత అనుకూలించిన గురు అనుగ్రహం ఎంత ఉన్నా శుక్ర అనుగ్రహం మీకు పూర్తిగా తప్పింది. కనుక ఇంట్లో ఉండే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా కనపడతాయి. పండ్రెండవ ఇంట్లో ఉన్న శని మీ ఆరోగ్యాన్ని మీ ధనాన్ని ఖర్చు పెట్టించే పరిస్థితి. రాహు ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంది గౌరవ భంగం కలుగుతుంది. ప్రతి పనులను మీరు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. మీకున్న పరిచయాలు ఇతరులకు ఉపయోగపడే తత్వమే కానీ మీకు ఉపయోగంలోకి రావు. ఈ వారంలో మీకు 35 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి జన్మతార అయింది ఆరోగ్య విషయంలో భద్రత అవసరం. శతభిషా నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార కాబట్టి అనుకూలంగా ఉంటుంది. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మిత్ర తార అయింది కాబట్టి అనుకూలతలు చాలా ఎక్కువ.

పరిహారం :- శని జపం చేయించండి నువ్వులనూనె నల్లని వస్త్రం దానం చేయించండి. బొబ్బర్లు దానం చేయండి నవగ్రహ ఉంగరాలు ఉన్నట్లయితే ధరించండి లేదా ఉన్నవారు అభిషేకంలో పెట్టి తీసి ధారణ చేయండి.

మీన రాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము లాభము బంధుమిత్రులు దర్శనం మంచి విశేష ఫలితాలను కలిగించి ఆనందాన్ని ఇస్తాయి. ఈ నెల మీకు రాహువు సర్వసంపదలను ఇచ్చి ఆనందింపజేసే పరిస్థితి ఉంది. అయితే కేతువు ద్వారా మీకు శత్రువులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కుజ ప్రభావం చేత మీకు శరీరంలో ఎడమ భాగానికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు అనారోగ్య సూచన మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం నుంచి మీకు బుధ శుక్ర శనులు మంచి అనుకూలతను కల్పించి మీరు ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాన్ని సూచిస్తారు. ఏదైనా వృత్తులలో ఉన్నత పదవిని గానీ లేదా ఆర్థిక స్థితిగతులను గానీ పొందే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రులు మీ మాట నైపుణ్యానికి అందరూ ఆనందిస్తారు. ఆకస్మిక ధనలాభము మీకు ఈ వారంలో వచ్చి చేరుతుంది. అది ఆస్తి పంపకాల రూపంలో కూడా మీకు లభించవచ్చు. మీకు ఈ వారంలో 42 శాతం శుభఫలితాలు కలిగే అవకాశం ఉంది. పూర్వాభాద్ర 4వ పాదం వారికి మిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి చాలా ఎక్కువ వ్యతిరేకత ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి చాలా ఫలితాలని పొందగలుగుతారు.

పరిహారము :- గురు స్తోత్ర పారాయణ చేయండి. నానబెట్టిన శనగలు గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి ఆవుకి బెల్లం వేసి తినిపించండి. ఎర్రని వస్త్రములు ఏదైనా దానం చేసేయండి.

Next Story