ముఖ్యాంశాలు

  • పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో ఆందోళనలు
  • యూపీలో 18కి చేరిన మృతుల సంఖ్య
  • జమ్ముకశ్మీర్‌లో హిందు, ముస్లిం ఉమ్మడి నిరసన ప్రదర్శన

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లక్షల మంది ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ చట్ట సవరణపై నిరసనలు కొనసాగుతున్నాయి. యూపీలో ఇప్పటి వరకు 750 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా 21 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను రేపటి వరకు బంద్ చేశారు. వదంతులను పోస్ట్‌ చేసిన 13 వేల వెబ్‌సైట్‌లను పోలీసులు గుర్తించారు. యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 18కి చేరింది. సీఏఏ వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో కర్నాటకలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పోలీస్‌స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు.

యూపీలో జరిగిన నష్టం అంచనాకు నలుగురు ఎంపీలతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆందోళనకారుల దాడుల్లో 263 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. కర్నాటక, తమిళనాడు, జమ్ము కశ్మీర్‌, బీహార్‌లోనూ ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జమ్మూలో హిందూ, ముస్లింల కలిసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన ప్రదర్శన చేపట్టారు. పాతబస్తీలో ఉన్న చార్మినార్‌ వద్ద ముస్లింలు నిరసనలు చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లండన్‌లోని పార్లమెంట్‌ స్కేర్‌ వద్ద వందలాది మంది విద్యార్థులు భారతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. భారత విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. మరోవైపు పౌరసత్వ సవరణ నూతన చట్టానికి మద్దుతుగా కొన్ని చోట్ల ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పౌరసత్వ సవరణ చట్టంపై అవగహన కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అవగహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.