చైనాకు చురకలు వేస్తూ.. సంకేతాలిచ్చిన రాష్ట్రపతి స్పీచ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 10:15 AM IST
చైనాకు చురకలు వేస్తూ.. సంకేతాలిచ్చిన రాష్ట్రపతి స్పీచ్

ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలామందికి కోపాలు వచ్చేస్తాయి. కానీ.. నిజం నిజమేగా. ప్రతి ఏటా ఆగస్టు 15.. జనవరి 26న ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగురవేయటం.. దానికి ముందు రోజున జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అయితే.. ఈ ప్రసంగాలు ఇంచుమించే ఒకేలా ఉంటాయన్న మాట ఉంది. అప్పటి ప్రభుత్వానికి.. వాటి విధానాల్ని తెలిపేలా రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా ఈసారి రాష్ట్రపతి పంద్రాగస్టు ప్రసంగం ఉందని చెప్పాలి.

ప్రభుత్వ విధానాల్ని చెప్పటమేకాదు.. దేశం ఏ దిశగా పయనిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు నడుస్తున్న కరోనా కాలాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కరోనా మహమ్మారిపై అవిశ్రాంతంగా పని చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ఈ క్రమంలో కొందరు దురదృష్టవశాత్తూ ప్రాణాల్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. నిజానికి వారే నిజమైన హీరోలని ప్రశంసించారు. కరోనా వారియర్లు అందరూ అత్యంత గౌరవాన్ని పొందటానికి అర్హులని పేర్కొన్నారు.

వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న పదిలక్షల మందికి పైనే స్వదేశాలకు తీసుకొచ్చారన్నారు. అవసరానికి తగ్గట్లు ఇండియన్ రైల్వే.. పలు రైళ్లను నడిపించారననారు. ప్రజల సంపూర్ణ సమకారం.. సమిష్టి ప్రయత్నాలతో కోవిడ్ మహమ్మారి తీవ్రతను నిరోధించగలిగినట్లుగా చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ప్రసంగంలో చైనాకు చురకలు వేశారు.

డ్రాగన్ దేశాన్ని తన ప్రసంగంలో నేరుగా ప్రస్తావించకున్నా.. అందరికి అర్థమయ్యేలా చురకలు వేసేందుకు వెనుకాడలేదు. యావత్ ప్రపంచం తమ ముందున్న అతి పెద్ద సవాలును ఎదుర్కొంటుండగా.. మరోవైపు మన పొరుగుదేశం మాత్రం విస్తరణవాదంతో దుస్సాహసం చేస్తోందన్నారు. మొత్తానికి తన ప్రసంగం ద్వారా చైనాకు పంపాల్సిన సంకేతాల్ని పంపినట్లుగా రాష్ట్రపతి ప్రసంగం ఉందన్న మాట వినిపిస్తోంది.

Next Story