దేశంలోని పలు రాష్ట్రాల రైతులు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరో వైపు విపక్షాలు కూడా వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్లమెంట్‌ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 20న పార్లమెంట్‌ ఈ బిల్లులను ఆమోదించింది.

వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరారు. అయినప్పటికీ ఆయన ఆమోద ముద్ర వేశారు. రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదింపచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి.

ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్‌ బంద్‌ చేపట్టాయి. హరియాణ, పంజాబ్‌, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగారు.

ప్రభుత్వం మాత్రం ఈ బిల్లులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని చెబుతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ కూడా విపక్షాలు రైతులను రెచ్చగొడుతూ ఉన్నాయని.. అనవసరంగా వారిలో అపోహలను పెంపొందిస్తూ ఉన్నాయని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story