త‌ప్పంతా నాదే.. నైట్‌రైడర్స్ తో పోరులో ఓటమిపై వార్నర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2020 8:21 AM GMT
త‌ప్పంతా నాదే.. నైట్‌రైడర్స్ తో పోరులో ఓటమిపై వార్నర్

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా శ‌నివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైద్రాబాద్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. తమ అభిమాన జట్టు ఓడిపోవడాన్ని సన్ రైజర్స్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే మినహా మిగతా వారెవ‌రూ రాణించ‌క‌పోవ‌డంపై సన్ రైజర్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.

అయితే.. ఈ మ్యాచ్‌లో ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించారు. నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో మా ప్రదర్శన ఏ మాత్రం బాలేద‌ని.. ముందు ఓవ‌ర్ల‌లో లభించిన రన్‌రేట్ ను కొనసాగించలేకపోయామని అన్నాడు. ఈ విష‌య‌మై తాను ఎవరినీ నిందించాల‌నుకోవ‌డం లేద‌ని.. తప్పంతా నాదేనని.. ఈ ఓటమికి బాధ్యతను కూడా తీసుకుంటున్నానని వ్యాఖ్యానించాడు.

మొద‌టి ఓవర్ నుండి దూకుడుగా ఆడాలన్న ఆలోచనతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తాను, దాన్ని కొన‌సాగించ‌లేక‌పోయాన‌ని అన్నాడు. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని స‌రిగా ఆడ‌టంలో విఫలమైన తాను అనవసరంగా ఔటై.. పెవిలియన్ చేరానని అన్నాడు. కేవ‌లం నాలుగు వికెట్లే కోల్పోయిన మేము.. ఇద్దరు ప్రధాన బ్యాట్స్ మెన్ లను ఉంచుకుని కూడా భారీ స్కోరు చేయ‌లేక‌పోయామ‌ని అన్నాడు.

ముఖ్యంగా 16వ ఓవర్ తరువాత వేగం ఆడాల్సిన బ్యాట్స్‌మెన్‌.. ఆ పని చేయడంలో విఫలం అయ్యారని అన్నాడు. ఇక‌, ఈ మ్యాచ్ లో దాదాపు 6 ఓవర్లు డాట్ బాల్స్ ఉన్నాయని.. టీ-20 ఫార్మ‌ట్ గేమ్‌లో ఇన్ని డాట్ బాల్స్ ఉంటే.. మ్యాచ్ గెలవడం కుద‌ర‌ద‌ని.. వచ్చే మ్యాచ్ లలో మైండ్ సెట్ ను మార్చుకుని బరిలోకి దిగుతామని అన్నాడు.

ఇదిలావుంటే.. ఐపీఎల్‌–2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ చేసింది. శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్‌ (29 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును గెలిపించారు.

Next Story