రాయుడు లేకే.. ఢిల్లీతో మ్యాచ్‌లో ఓటమి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2020 3:26 AM GMT
రాయుడు లేకే.. ఢిల్లీతో మ్యాచ్‌లో ఓటమి

ఢిల్లీతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తేలిపోయింది. అన్ని ఫార్మాట్లలో విఫలం చెందింది. వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆల్‌రౌండ్ షో తో విజృంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లి క్యాపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రేయస్ సేన ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పృథ్వీ షా (64; 43 బంతుల్లో 9పోర్లు, 1 సిక్సర్‌), ధావన్‌(35; 27బంతుల్లో 3పోర్లు, 1 సిక్సర్‌), రిషబ్‌పంత్‌ (37; 25బంతుల్లో 5పోర్లు), శ్రేయాస్‌ అయ్యర్‌(26; 22 బంతుల్లో 1పోర్‌) అదరగొట్టారు. అనంతరం చేధనకు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. అక్షర్‌ పటేల్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతికి షేన్‌వాట్సన్‌(14) భారీ షాట్‌ కొట్టబోయి హెట్‌మెయిర్‌కు‌ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత మురళీ విజయ్‌(10) కూడా స్పల్ప స్కోరుకే ఔటయ్యాడు. దీంతో చెన్నై 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అండగా నిలుస్తాడు అనుకున్న రుతురాజ్‌(5) ఓ అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు.

తర్వాత కేదార్‌ జాధవ్(26), డుప్లెసిస్(43; 35 బంతుల్లో 4పోర్లు) నిలకడగా ఆడినప్పటికి ఫలితం లేకపోయింది. నోర్జే వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతికి కేదార్‌ జాధవ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి డుప్లెసిస్‌ కీపర్‌కు చిక్కాడు.దీంతో సీఎస్‌కే 18 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పొయి కష్టాల్లో పడింది. చివరకు ధోనీ(15) కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చలేకపోయాడు. దీంతో మహీసేన 131/7కే పరిమితమైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రభాగానికి చేరుకుంది.

మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. అంబటి రాయుడు లేకపోవడంతోనే చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయామన్నాడు. 'బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌ కాదు. తేమ లేనప్పటకి వికెట్‌ నెమ్మదించింది. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడంతో రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకు వీలుంటుందని' ధోని అన్నాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయుడు 48 బంతుల్లో 71 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే.

Next Story