కోహ్లీ క్యాచ్ డ్రాప్స్‌ పై గవాస్కర్ డబుల్ మీనింగ్.. ఫ్యాన్స్‌ ఫైర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 8:28 AM GMT
కోహ్లీ క్యాచ్ డ్రాప్స్‌ పై గవాస్కర్ డబుల్ మీనింగ్.. ఫ్యాన్స్‌ ఫైర్‌

క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఊరికే అనలేదు. ఫీల్డర్ ఒక్క క్యాచ్ జారవిడిచినా దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అదే రెండు క్యాచ్‌లు జారవిడిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో గురువారం బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు చూసింది. ఆ జట్టు కెప్టెన్‌, మేటి ఫీల్డర్‌ విరాట్‌ కోహ్లీ రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఫలితంగా పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ మరింత రెచ్చిపోయి ఆడి తన జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 206 పరుగులు నమోదు చేసింది. కేఎల్ రాహుల్ ఆటే ఈ ఇన్నింగ్స్ కు హైలైట్ అని చెప్పాలి. రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 132 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

కోహ్లీ ఇచ్చిన లైఫ్ తరువాత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేప్టెన్ కేఎల్ రాహుల్ విశ్వరూపాన్ని చూపాడు. తొమ్మిదంటే తొమ్మిది బంతులను మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 42 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో తన సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు. 132 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 83 పరుగుల వద్ద ఒకసారి.. 89 పరుగుల వద్ద మరోసారి ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను కోహ్లీ మిస్ చేశాడు. దాని ప్రభావం జట్టు గెలుపోటములపై పడింది. పంజాబ్ టీమ్ స్కోర్ 200ల మార్క్‌ను దాటడానికి కారణమైంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌‌ను మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో విరాట్ కోహ్లీ రాణిస్తాడని బెంగళూరు ఫ్యాన్స్‌ ఆశించారు. అయితే.. కోహ్లీ అయిదు బంతులను మాత్రమే ఆడి షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు నాలుగు పరుగులే. విరాట్ కోహ్లీ అవుటైన వెంటనే టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్.. ఓ హాట్ కామెంట్ చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం అనుష్క బౌలింగ్‌లోనే అతను ప్రాక్టీస్‌ చేయడం మనం వీడియోలో చూశాం. అయితే దాని వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు'అని గావస్కర్‌ పేర్కొన్నారు. అది కాస్తా కోహ్లీ ఫ్యాన్స్‌నే కాదు.. ఇటు అనుష్క అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేసింది.

సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్‌ను ఉటంకిస్తూ.. ఆయనపై విరుచుకుపడుతున్నారు విరుష్క ఫ్యాన్స్. అంత పెద్దాయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. సునీల్ గవాస్కర్ హుందాగా వ్యవహరించట్లేదని మండిపడుతున్నారు. ఆయనను కామెంటేటర్‌ హోదా నుంచి తొలగించాలని పట్టుబడుతున్నారు. అలాంటి డబుల్ మీనింగ్ అర్థాలతో వ్యాఖ్యానాలు చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు.

Next Story