రెండ్రోజులు అంబులెన్స్ లోనే గర్భిణీ.. ఆఖరికి
By తోట వంశీ కుమార్ Published on 10 July 2020 7:10 AM GMTముఖ్యాంశాలు
- నెలలు నిండిన గర్భిణీకి వైద్యం కరువు
- కార్పొరేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం
- ఆపరేషన్ చేయాలంటే రూ.8 లక్షలు కావాలన్న ఒక ఆస్పత్రి
- బెడ్లు ఖాళీ లేవని చెప్పిన మరో ఆస్పత్రి
- వైద్యం చేయలేమని చేతులెత్తేసిన వైద్యులు
బిడ్డకు జన్మనివ్వడంతో ఆడపిల్ల అమ్మ అవుతుంది. తల్లి అవ్వడంతోనే ఆడపిల్ల జన్మ పరిపూర్ణమవుతుందంటారు పెద్దలు. తాను కడుపుతో ఉన్నానని తెలిసినప్పటి నుంచి ఆ తల్లి బిడ్డకోసం ఎన్నో కలలు కంది. కానీ ఆఖరికి ఆ కలలన్నీ కల్లలయ్యాయి. అందరి తల్లులలాగే ఆ తల్లి కన్న కలల్ని ఆస్పత్రుల నిర్లక్ష్యం చిదిమేసింది. ఫలితంగా కడుపులోనే బిడ్డ అసువులుబాయగా..ఆ తల్లికి అనారోగ్యం, గర్భశోకమే మిగిలాయి. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంకు చెందిన గర్భిణీ స్త్రీ విజయకు నెలలు నిండటంతో కుటుంబ సభ్యులు జూన్ 29న డెలివరీ కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడ్రోజుల పాటు వైద్యం చేసిన డాక్టర్లు తమ ఆస్పత్రిలో డెలివరీ చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని..వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు జులై 3వ తేదీన ఆమెను అంబులెన్స్ లో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి వైద్యులు గర్భిణీకి వైద్యం చేసేందుకు నిరాకరించారు. దీంతో సోమాజిగూడలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ బెడ్లు లేవని పంపించేశారు. అనంతరం జూబ్లిహిల్స్ లోని ఇంకొక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భిణీ పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు తాము వైద్యం చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. అదేరోజు రాత్రి సికింద్రాబాద్ లోని మరో ఆస్పత్రికి వెళ్లగా..అక్కడా ఇదే పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబసభ్యులు 100కు డయల్ చేసి విషయం చెప్పగా..పోలీసులు వచ్చి గర్భిణీకి వైద్యం చేయాలని వైద్యులను ఆదేశించారు. అందుకు వైద్యులు కూడా సరేనన్నారు. కానీ వైద్యం చేసేందుకు రూ.8 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.
రూ.8 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. దాంతో చేసేదేమీ లేక తిరిగి సొంత ఊరికి వెళ్లిపోయారు. అక్కడ తెలిసినవారి సలహా మేరకు జులై 5వ తేదీన సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ గర్భిణీని పరిశీలించిన వైద్యులు కడుపులో శిశువు మృతి చెందిందని గుర్తించి శస్త్ర చికిత్స చేసి శిశువును తొలగించారు. ఆ తర్వాత గర్భిణీ కాస్త కోలుకోవడంతో గురువారం డిశ్చార్జి చేశారు.
కానీ ఆ తల్లికి మిగిలిన గర్భశోకాన్ని మాత్రం ఎవరూ తీర్చలేరు. ఇది ఎవరి తప్పు ? ఆస్పత్రిలో సరైన వసతులు లేని సంగారెడ్డి వైద్యుల తప్పా ? లేక వైద్యం కోసం నాలుగు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా పట్టించుకోని పెద్ద డాక్టర్ల నిర్లక్ష్యమా ? తల్లి కడుపులో ఉన్న బిడ్డను క్షేమంగా రక్షించలేని డాక్టర్ల చదువులు ఇంకెందుకు ఉపయోగపడుతాయి అని..ఈ విషయం తెలిసిన వారంతా ప్రశ్నిస్తున్నారు.