తెలంగాణ సిత్రం.. ప్రైవేట్ లో బెడ్ల కోసం క్యూ.. సర్కారీ దవాఖానాలో మస్తు ఖాళీ

By సుభాష్  Published on  10 July 2020 5:51 AM GMT
తెలంగాణ సిత్రం.. ప్రైవేట్ లో బెడ్ల కోసం క్యూ.. సర్కారీ దవాఖానాలో మస్తు ఖాళీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆసక్తికర అంశాన్ని పేర్కొంది. అంతకంతకూ పెరుగుతున్న కేసుల వేళ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లకు తీవ్రమైన కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం వెయిటింగ్ లిస్టు నడుస్తోంది. తక్కువలో తక్కువ ఒక్కో ఆసుపత్రిలో యాభై వరకూ వెయిటింగ్ లిస్టు ఉండటం.. బెడ్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సిన పరిస్థితి.

ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే.. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం బెడ్లు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న వైనాన్ని తెలంగాణ హెల్త్ బులిటెన్ తాజాగా పేర్కొంది. ప్రైవేటుకు క్యూ కడుతున్న బాధితులు.. సర్కారీ దవాఖానాకు వెళ్లేందుకు మాత్రం హడలిపోతున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మొత్తం బెడ్లలో 9 శాతం మాత్రమే బాధితులు ఉన్నారని.. 91 శాతం ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17,081 కరోనా బెడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో 11,928 ఐసోలేషన్ బెడ్లు.. 3537 ఆక్సిజన్ బెడ్లు.. 1616 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. వీటిల్లో ఐసోలేషన్ బెడ్లు 944.. ఆక్సిజన్ బెడ్లు 423.. ఐసీయూ బెడ్లు 185 మాత్రమే నిండి ఉండటం గమనార్హం. ఇంత భారీగా బెడ్లు మిగిలి ఉంటే.. రోగులు మాత్రం ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే వెళుతున్న వైనం తాజా నివేదిక వెల్లడించింది.

హైదరాబాద్ మహానగరంలో కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రిని సిద్ధం చేయటం.. ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చే వరకూ ఇక్కడే వైద్యం చేశారు. అలాంటి చోట కూడా రోగుల సంఖ్య తక్కువగా ఉంది. దీనికి కారణం సీరియస్ కేసుల్ని మాత్రమే చేర్చుకోవటంతో బెడ్లుఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. తక్కువ లక్షణాలతో ఉన్న వారిని కింగ్ కోఠి.. చెస్ట్.. ఫీవర్ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తుంటే.. స్వల్ప లక్షణాలతో ఉన్న రోగుల్ని నేచర్ క్యూర్.. ప్రభుత్వ నిజామియా.. ప్రభుత్వ ఆయుర్వే.. ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోని విచిత్రమైన పరిస్థితిని తెలంగాణ సర్కారు విడుదల చేసిన తాజా బులిటెన్ వెల్లడించిందని చెప్పాలి.

Next Story