తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2020 12:16 PM GMT
తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు..

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను కూడా పాస్‌ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పరీక్షలను రద్దు చేసినట్లు మంత్రి వివరించారు. మార్చి 2020లో జరిగిన ద్వితియ సంవత్సర పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణత పొందిన వారు కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొనడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 1.47 లక్షల మంది విద్యార్థులు ప్రమోజనం పొందనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలను జూలై నెల 31 తరువాత సంబంధిత కళాశాల్లో పొందవచ్చునని మంత్రి తెలిపారు. అయితే.. మార్కుల రీ కౌంటింగ్‌, రీ వేరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తామని మంత్రి వివరించారు.

Next Story