అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2020 4:29 PM ISTత్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద అనారోగ్యంతో తాడిపత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చిన్నపొలమడలోని ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. 1950లో ప్రబోదానంద జన్మించారు. ప్రబోదానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె ఆయన స్వగ్రామం.
మొదట పెద్దన్న చౌదరిగా భారత సైన్యంలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన ఆయన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేశారు. వైద్యుడిగా కొనసాగుతూ ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. అంతేకాదు ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథాలు రచించారు. తర్వాత ఆధ్మాత్మిక గురువుగా మారిపోయారు.
తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరాన్ని స్థాపించారు. మానవులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని, త్రైత సిద్ధాంతం ఇదే చెబుతుందని ప్రబోధానంద తన రచనల ద్వారా చెప్పేవారు. ఆధ్మాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు.
హిందూ, ముస్లిం దేవుళ్లపై ప్రబోధానంద చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి. రెండేళ్ల క్రితం జేసీ దివాకరరెడ్డి వర్గీయులకు, ప్రబోధానంద స్వామి శిష్యుల మధ్య భారీ ఘర్షణ కూడా జరిగింది. జేసీతో వైరంతో రాష్ట్రవ్యాప్తంగ ప్రబోధనందా స్వామి సంచలనంగా మారారు.
ప్రబోధానంద స్వామి మరణంతో వేలాది మంది మంది భక్తులు విషాదంలో మునిగిపోయారు. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడకు ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. కడప జిల్లా కొండాపురం మండల బెడుదురు కొట్టాలపల్లిలో ప్రబోధానంద స్వామి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.