ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉచిత‌ వ్యవసాయ విద్యుత్ సరఫరా పథకంలో జ‌గ‌న్‌ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక‌నుండి విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు ప్రభుత్వం చెల్లించనున్నది. రైతుల‌ వినియోగం మేరకు వచ్చిన బిల్లులు.. వారే స్వ‌యంగా డిస్కంలకు చెల్లించేలా ప్ర‌భుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ విష‌య‌మై రాష్ట్ర‌ ప్ర‌భుత్వం మంగళవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన జీవోను ఇంధన శాఖ జారీ చేసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు రూ.8,400 కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ విద్యుత్ కొరకు ఏపీ ప్రభుత్వం రైతులకు నగదు బదలీ పథకం ప్రారంభించింది. 2020-2022 ఆర్థిక సంవత్సరం నుంచి నగదు బదిలీ పథకం ప్రారంభం కానుంది.

ఈ ప‌థ‌కం ద్వారా రైతులకు నెలవారీ నమోదైన బిల్లు డ‌బ్బును ముందుగానే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేయనున్నది. ప్రభుత్వం నుంచి అందుకున్న బిల్లు మొత్తాన్ని తిరిగి రైతులు డిస్కంలకు చెల్లించాలి. రైతుల జేబులో నుండి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. దీనివల్ల రైతులకు ప్రభుత్వం నుంచి ఎంత ఆర్థిక సాయం అందుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది.. అలాగే.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అడిగే హక్కు ఉంటుంది. ఈ పథకం ఉచిత వ్యవసాయం విద్యుత్ పొందుతున్న రైతులందరికీ అమలు కానుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story