కాపుల‌పై గురి.. బీజేపీ నేత‌ల వ‌రుస ట్వీట్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Sep 2020 9:29 AM GMT
కాపుల‌పై గురి.. బీజేపీ నేత‌ల వ‌రుస ట్వీట్లు

తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు తాము ఒక కులానికి, మతానికి మాత్రమే తోడుగా లేమంటూ చెబుతూ ఉన్నప్పటికీ.. ఆయా పార్టీలలో కొన్ని కులాలదే పెద్ద పీఠ అని చెబుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తే టీఆర్ఎస్ లో వెలమ కులానికి చెందిన నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇతర పార్టీలకు చెందిన వారు కూడా అవే తరహా విమర్శలు చేస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారని కూడా బయట టాక్ నడుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని రెండు బడా పార్టీలలో ఒకటైన తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక ముద్రను వేశారు. ఆ ముద్రను చెరిపేసుకోడానికి ఆ పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. ఇక వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఉందని టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు.

సామాజిక న్యాయం పేరుతో మెగా స్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందినదిగా కొందరు ప్రచారం చేయడం.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడం జరిగిపోయాయి. ఇక జనసేన పార్టీకి కూడా కాపు ముద్ర వేయాలని కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. బీజేపీ-జనసేన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వాద‌న‌ల‌కు బ‌ల‌మిస్తూ కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన‌ ప‌వ‌న్ పుట్టిన రోజు నాడు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ‌ కొంత‌మంది బీజేపీ నేత‌లు ట్వీట్లు చేశారు.



తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబడిన బండి సంజయ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను బీజీపీ నియమించడం పట్ల ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న సోము వీర్రాజు కూడా మెగా స్టార్ చిరంజీవిని కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో కాపు ఓటర్లను ఆకర్షించే ప్రణాళికలు ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.



బీజేపీ-జనసేన పొత్తు కూడా 2024 ఎన్నికల్లో భాగంగానేనని అనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఇప్పటికే మంచి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అందుకు జనసేన మద్దతుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 2024 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకును జనసేన-బీజేపీలు సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మరింతగా ప్రజల్లోకి దూసుకువెళ్లాలని భావిస్తూ ఉన్నాయి జనసేన-బీజేపీ పార్టీలు. కాపు ఓటర్లను ప్రభావితం చేయగలగడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉన్నారు.



Next Story